జీవ వైవిధ్యం పశుపక్షాదులకేనా ?

– అంతరిస్తున్న ఆదివాసీ తెగలు గోండు, చెంచుల సంగతేంది ?
– మూగ జీవాలపై ఉన్న ప్రేమ అడవి బిడ్డలపై లేదెందుకు ?
హైదరాబాద్‌లో తెలంగాణ మార్చ్‌ నిర్వహించుకుంటామంటే, వద్దొద్దు మీరు చెప్పిన రోజు తెల్లారే జీవవైవిధ్య సదస్సు ఉందని గోగ్గోలు పెట్టిన ప్రభుత్వం, దానికి వత్తాసు పలికుతూ కార్పొరేట్‌ మీడియా చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. మన తెలంగాణలోని మారుమూల గ్రామంలో బతికే మనిషికి ఇదంతా ఏం అర్థం కాలేదు. అరె, తెలంగాణ ఇవ్వమంటే, ఏదో మీటింగుందని అంటరేంది అని చికాకు పడ్డడు. తెలిసినంక ఆశ్చర్యపడ్డడు. పశువులు, పక్షులు అంతరించిపోతున్నాయని కోట్లు ఖర్చు పెట్టి మీటింగులు పెడుతున్నరా అంటూ నవ్వుకున్నడు. అడవులను, నరకక ముందు, గుట్టలను పేల్చక ముందు ఈ మీటింగులేవో పెట్టుకుంటే, ఇప్పుడు ఆ పశువులు, జంతువులు కళ్ల ముందే ఉండేటివి కదా అని మండిపడ్డడు. అయినా, మనుషుల ప్రాణాలనే లెక్క చేయని ప్రపంచ పాలకులకు, మేధావులమని చెప్పుకుంటూ ఆ పాలకులకు దిశా నిర్దేశం చేసే వారికి ఇప్పుడు మూగ జీవాల మీద ప్రేమ ఎందుకు పుట్టిందో ! సరే ఇన్నాళ్లకైనా మన ప్రకృతిని కాపాడుకోవాలని అనుకుంటున్నందుకు పాలకులను ఓ రకంగా అభినందించవచ్చు. మరి అంతరించిపోతున్న మానవుల మూల పురుషుల సంగతే వీరికి ఎందుకు పట్టడం లేదో అర్థం కావడం లేదు. పిట్టలు, ముంగీసలు, ఫలానా రకం పాములు, సీతాకోకచిలుకలు, బర్రెలు, గొర్రెలు అంతరించి పోతున్నట్లే, మానవ జాతుల్లో కొన్ని రకాలు అంతరించిపోతున్నాయి. ఇది నిజం. అంతరించిపోతున్న మూగ జీవాల సాక్షిగా, ఆ మూగ జీవాలతోపాటే కొన్ని మానవ జాతులు కూడా అంతరించిపోతున్నాయి. నిత్యం అరణ్యంలో ఉండి, అక్కడి వన్య ప్రాణులతో స్నేహం చేస్తూ, కాంక్రీటు జంగల్లోకి తొంగిచూడని అనేక ఆదివాసీ తెగలు ప్రస్తుతం కనుమరుగయ్యే ప్రమాదముంది. నిప్పులాంటి ఈ నిజానికి తెలంగాణ జిల్లాల్లోని అడవులే నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. దీనికి కారణం అడవులను అనాగరికంగా నరుకుతున్న నాగరికులే ! దీంతో అరణ్యంలోని వన్య ప్రాణులతో సహా అడవి బిడ్డలు కూడా జనారణ్యంలోకి వస్తున్నారు. ఇక్కడి కుతంత్రాల జీవితానికి అలవాటు పడక చితికిపోతున్నారు. ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. ఆదివాసీ తెగలు అంతరించి పోవడానికి మరో ప్రధాన కారణం పాలకులు వారిని నిర్లక్ష్యం చేయడం. అడవిలో వాతావరణం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అక్కడ మలేరియా, డెంగ్యూ జ్వరాలు వస్తే వందల సంఖ్యలో ఆదివాసులు ప్రాణాలు కోల్పోతారు. వాంతులు, విరోచనాలు మొదలైతే పదుల సంఖ్యలో శవాలు లేస్తాయి. కానీ, ఈ మరణాలు అడ్డుకునేందుకు ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోదు. వారి కోసం ఆసుపత్రులు నిర్మించదు. వ్యాధులు ప్రబలే కాలంలో కనీసం వైద్య శిబిరాలైనా ఏర్పాటు చేయడానికి ముందుకు రాదు. దీంతో బతికే అవకాశమున్న రోగం వచ్చినా, దానికి వైద్యం చేయించుకునే స్థోమత లేక, చేయించుకుందామనుకున్న అందుబాటులో ఆసుపత్రి లేక ప్రాణ నష్టం పెరుగుతున్నది. ఇదంతా పాలకులకు పట్టదు. కేవలం వ్యాధుల కారణంగానే నల్లమలలోని చెంచు తెగ, ఆదిలాబాద్‌ జిల్లాలోని గోండు తెగ, ఖమ్మం జిల్లాలోని గుత్తి కోయల తెగ తదితర ఆదివాసీల జనాభా సగానికి తగ్గిపోయిందనేది నమ్మలేని నిజం. ఈ మృత్యుకేళికి పరోక్షంగా ప్రభుత్వమే కారణమవుతున్నది. ఇలా అడవి బిడ్డల మరణాలు సంభవిస్తుంటే ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండాల్సిన మీడియా కూడా తన విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదు. అడవిలో మలేరియా, డెంగ్యూలాంటి రోగాలు ప్రబలుతున్నా పట్టించుకోని ‘సమాజపు నాలుగో స్తంభం’, పాశ్చాత్య దేశాల నుంచి మన దేశంలోకి వచ్చిందో, రాలేదో తెలియని స్వైన్‌ఫ్లూ గురించి గోరంతను కొండంతలుగా చేస్తుంది. కారణం ఇది ధనికులకు వచ్చే రోగం కాబట్టి. మీడియా కూడా ప్రజలను వ్యాపార కోణంలో చూడడం అత్యంత బాధాకరమైన అంశం. ప్రపంచ జనాభా, దేశ జనాభా రోజు రోజుకు పెరుగుతుంటే, ఈ పెరుగుదలతో అభివృద్ధి ఆగిపోయే ప్రమాదముందని గగ్గోలు పెట్టే పాలకులు, ఆదివాసీ తెగలకు తెగలే కనుమరుగవుతున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఆదివాసీలు కూడా ఈ దేశ పౌరులే అన్న సంగతే మరిచారు. అందుకే, వీళ్లకు రోగమొచ్చినా, పాడెలెక్కుతున్నా లెక్క చేయడం లేదు. మొన్న మీడియాలో వచ్చిన ఓ వార్త సంచలనం కలిగించింది. ఆ కథనం మూలాంశం ఏమిటంటే రాబందువులు అంతరించిపోతున్నాయి.. ఎవరైనా ఒక్క రాబందును తీసుకువస్తే ప్రభుత్వం నుంచి రెండు లక్షల బహుమానం ఉంటుందట ! ఈ వార్త చదివిన, విన్న మానవతావాదుల గుండెలు కలుక్కుమనే ఉంటాయి. ప్రభుత్వం రాబందులకు ఇచ్చే స్థానం కూడా ఆదివాసీలకు ఇవ్వడం లేదని. సాటి మనుషులకు కాపాడే గుణం లేని పాలనా వ్యవస్థ ఉంటే ఎంత.. లేకుంటే ఎంత అని అనుకునే ఉంటారు. అయితే, ఆదివాసీలను విస్మరించడంలోనూ రాజకీయ నాయకుల స్వార్థముంది. ఎందుకంటే, ఆదివాసీలకు ఓటు హక్కు అవగాహన లేకపోవడం. వీళ్లు ఓట్లు వేయరని పాలకులకు సుస్పష్టంగా తెలియడం. ఆదివాసీలను ఓట్లు అడిగేందుకు అడవుల్లోకి వెళ్లాల్సిన పని లేదన్న ధీమా పాలకుల్లో ఉండడమే. అందుకే, ఆదివాసీలను ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయనే విమర్శలున్నాయి. ఇలాంటి దిక్కుమాలిన కారణాల వల్లనే పాలకులు ఆదివాసీలను కనీసం పౌరులుగా గుర్తించడం లేదన్నది విచక్షతో ఆలోచిస్తే తెలిసిపోతుంది. ఇక్కడ తమ ఊరి పక్కనున్న జంగల్లో ఉండే, సాటి మనుషులైన ఆదివాసీలనే రక్షించలేని పాలకులున్న నేటి దేశాల్లో, అంతరించిపోతున్న మూగజీవాలను కాపాడుతారంటే ఎట్ల నమ్మాలె ?