జూనియర్‌కళాశాలల్లో నిఘా నేత్రాలు

ఈ ఏడాదినుంచే మార్పులు
మధ్యాహ్నభోజనం, రూపాయి లేకుండా ప్రవేశాలు
విద్యార్థులకు చేరువయ్యేందుకు ప్రభుత్వం తంటాలు
కరీంనగర్‌,జూన్‌ 20(జ‌నంసాక్షి): రాష్ట్రంలో రోజురోజుకు ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తుండడంతో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. దీనిని సీరియస్‌గా భావించిన తెలంగానా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంటుంది. ఈసంవత్సరం నుంచే అనేక మార్పులు తీసుకురావాలని యోచిస్తోంది. మెరుగైన విద్యను అందించేందుకు అనేక చర్యలను ఇప్పటికే రూపొందించి క్రింది స్థాయి అదికారులకు దిశా నిర్దేశనం చేసింది. కళాశాలల్లో పనిచేసే అద్యాపకుల సమయపాలన, విద్యార్థుల హాజరు శాతంపై కూడా ప్రభుత్వం సీరియస్‌గానే పరిగణిస్తోంది. కళాశాలల పనితీరును పర్యవేక్షించేందుకుగాను సాంకేతికతను వినియోగించనున్నారు. ఇందుకోసం అన్ని ప్రభుత్వ కళాశాలల్లో బయో మెట్రిక్‌ మిషన్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఈ విద్యాసంవత్సరం నుంచి మద్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో బాగంగా కళాశాలల్లో విద్యార్థులు బోదనా సిబ్బంది బోదనేతర సిబ్బంది హాజరును బయో మెట్రిక్‌ ద్వారా నమోదు చేయనున్నారు. జిల్లాలోని 58 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలుండగా ఇందులో 8 బాలికల కళాశాలలున్నాయి. కరీంనగర్‌, కోరుట్ల, గోదావరిఖనిలో కళాశాలల్లో ఇంగ్లీష్‌ విూడియం అమలు అవుతుంది. ప్రతి కళాశాలకు రెండు చొప్పున బయోమెట్రిక్‌ హాజరు మిషన్లను సరఫరా చేసింది. ఒక మిషన్‌ను విద్యార్థులకోసం, మరోటి టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ హాజరు నమోదు శాతాన్ని నమోదు చేసేందుకు వినియోగించనున్నారు. కళాశాలలకు వచ్చేప్పుడు తిరిగి వెల్లేప్పుడు విద్యార్థులు, సిబ్బంది వేలిముద్రలను నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో సమయ పాలనను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రతికళాశాలలో నాలుగు క్లోజ్‌డ్‌ సర్క్యూట్‌ కెమెరాలను అమర్చారు. కళాశాల ఎంట్రన్స్‌లో ఒకటి, టీచింగ్‌ స్టాఫ్‌రూంలో ఒకటి ప్రిన్సిపాల్‌ రూంలో, నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ రూముల్లో ఒకటి చొప్పున కెమెరాలను అమర్చారు. ఆన్‌లైన్‌ ద్వారాకెమెరాలను ఆర్‌ఐఓ, ఇంటర్‌ బోర్డు కార్యాలయాలకు అనుసంధానించనున్నారు వీటి ఆదారంగా కళాశాలల పనితీరును ఉన్నతాదికారులు పర్యవేక్షించే అవకాశం ఉంది. కళాశాలల్లో జరిగే బోదన అబ్యసన ప్రక్రియలను ఉపన్యాసకులు విద్యార్థులు బోదనేతర సిబ్బంది హాజరును తెలుసుకునే వీలుంటుంది. కళాశాలలో నిర్వహించే కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించే వెసులుబాటు లభిస్తుంది. అయితే ఈఏడాది నుంచి ప్రభుత్వ కళాశాలల్లో చేరే విద్యార్థులకు ఒక్కటంటే ఒక్కరూపాయి కూడా ఖర్చు కాకుండా ఉచిత విద్యను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రవేశరుసుం, దరఖాస్తు ఫారంతోపాటు పరీక్ష ఫీజులు, ఇతర రకాల ఫీజులు పూర్తిగా రద్దయ్యాయి. అన్నికళాశాలల్లో జూన్‌ 1నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమై 30 వరకు నిర్వహిస్తున్నట్లు అధికారులుచెపుతున్నారు. అవసరమైతే కళాశాలల్లో సీట్ల సంఖ్య పెంచేలా ఆయా కళాశాల ప్రిన్సిపాళ్లకు ఇంటర్‌ బోర్డు అనుమతులిచ్చింది. ఈనెలలోనే ప్రారంభమయ్యే తరగతుల్లో ఉచిత విద్యతోపాటు సాయంత్రం 4నుంచి 5 గంటలవరకు విద్యార్థులకు మానసికోల్లాసం కలిగించేలా యోగా క్రీడల్లో శిక్షణ ప్రవేశపెడుతున్నట్లు అధికారులు చెపుతున్నారు. సర్కార్‌ జూనియర్‌ కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచడానికి ప్రభుత్వం సన్నబియ్యంతో మద్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని కూడా

నిర్ణయించింది. ఈసంవత్సరమే ప్రారంభించనున్నారు. ఈవిధానం వల్ల జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల చేరిక పెరగడమే కాక హాజరుశాతం మెరుగు పడుతుందని విద్యావేత్తలు చెపుతున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే వారిలో నూటికి 90శాతం మంది గ్రావిూణ ప్రాంతాలనుంచి వచ్చివెల్లే వారు కావడంతో బస్‌లలో ప్రయాణానికి ప్రాధాన్యత నిస్తున్నారు. ఉదయం 7-8 గంటలకు గ్రావిూణ ప్రాంతాలనుంచి వచ్చేవారు సాయంత్రం వరకు ఉండాలంటే కూడా భోజనం లేకుండా కష్టం అవుతుండడంతో నూటికి 99శాతం మంది మద్యాహ్నమే వెల్లిపోతుంటారు. ముందుగా ప్రాధాన్యతా సబ్జెక్టుల తరగతులకు మాత్రమే హాజరై కాస్తా సులువుగా ఉన్న వాటిని సొంతంగా చదువుకుందామనుకునే వారే ఇంతకాలం ప్రభుత్వ కళాశాలల్లో చేరారు. ఈసంవత్సరం నుంచి విద్యావిధానంలో మార్పు రావడంతో ఖచ్చితంగా హాజరు శాతం పెరగడమేకాక అడ్మిషన్లు కూడా పెరుగుతాయనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది,. దీనిని విద్యావేత్తలు కూడా ఆదరిస్తున్నారు.