జూన్ 6న పంచాయతీ ఎన్నికల ప్రకటన
హైదరాబాద్: రాష్ట్రంలో పల్లెల్లో ఎన్నికల నగారా మోగనుంది. జూన్ 6వ తేదీన పంచాయతీ ఎన్నికల ప్రకటన జారీ చేసి అదేనెల 23వ తేదీలోగా ప్రక్రియనంతా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికలను నిర్ణీత గడువుకంటే ముందుగానే నిర్వహించేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది. దాదాపు 15 పంచాయతీలు తప్ప మిగతా పంచాయతీల ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం జులై నెలాఖరుతో ముగుస్తుంది. ఎన్నికలను అంతకంటే 5వారాల ముందుగానే నిర్వహించి పాలకవర్గాలకు శిక్షణ ఇవ్వాలనేది సర్కారు యోచన. తర్వాత ఆగస్టు 1వ తేదీన కొత్త పాలకవర్గాలు కొలువుతీరతాయి. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో పంచాయతీరాజ్ శాఖ అధికారులు సోమవారం భేటీ అయి ఎన్నికల తేదీల ప్రతిపాదనలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించినట్లు సమాచారం.రాష్ట్రప్రభుత్వం గతనెల 18వ తేదీన అమల్లోకి తెచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం.. ఎన్నికల ప్రకటన వెలువడ్డ తేదీని కలుపుకొని 12వ రోజున పోలింగ్, ఓట్ల లెక్కింపుల ప్రక్రియను పూర్తి చేయాలి. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ వంటి ఏ పనిని ఎన్నేసి రోజుల్లో పూర్తి చేయాలనేది గరిష్ఠ సమయంతో సహా కొత్త చట్టం చెబుతోంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన వాటితో కలిపి ప్రస్తుతం 12,751 పంచాయతీలు, వాటిలో 1,13,380 వార్డులు ఉన్నాయి. వీటిలో పాలకవర్గాల పదవీ కాలం పూర్తి కావడానికి ఇంకా కొంత వ్యవధి ఉన్న దాదాపు 15 పంచాయతీలను పక్కన పెడితే మిగతా వాటన్నింటికీ ఎన్నికలను నిర్వహించాలి. పంచాయతీలు పెద్దసంఖ్యలో ఉన్నందున పోలింగ్‌ను మూడు విడతల్లో నిర్వహిస్తారు. ఇదంతా జూన్ 23వ తేదీకి ముగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. పంచాయతీల వారీ, వార్డుల వారీ ఓటర్ల తుది జాబితాలు ఈనెల 17న వెలువడతాయి. వెనువెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. వీటన్నింటిలోనూ జనరల్ కేటగిరి స్థానాల్లోను తిరిగి 50 శాతం స్థానాలను మహిళలకు కేటాయిస్తారు.