జూన్ 3 నుండి నిర్వహించు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతం చేయాలి -మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ బ్యూరో-జూన్1(జనంసాక్షి)

జూన్ 3 నుండి నిర్వహించు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతం చేయాలని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రజాప్రతినిధులను, అధికారులను కోరారు. బుధవారం కలెక్టరేట్ లోని ప్రగతి సమావేశ మందిరంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ తో కలిసి 5 వ విడత పల్లె ప్రగతి, 4వ విడత పట్టణ ప్రగతి సన్నాహక సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళికను సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల,పట్టణాలు అభివృద్ధి  అద్భుతంగా జరుగుతుందనీ, మూడో తేదీ నుండి ప్రారంభం కానున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. గత అధికారుల పాలనలో సర్పంచులు ఎన్నో ఇబ్బందులు పడ్డారనీ, కేంద్ర ప్రభుత్వం అనేక నిబంధనలు మార్చడం ద్వారా రాష్ట్రానికి అందాల్సిన ఉపాధి హామీ పేమెంట్స్ రాకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, సర్పంచులకు అందాల్సిన పేమెంట్స్ రెండు మూడు రోజులల్లో వారి అకౌంట్లలో జమ అవుతాయని, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్. ఆశయాలు, ఆలోచనకు అనుగుణంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి కట్టుగా సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమాలకు అధికారులను బాధ్యులను చేస్తూ ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు. ఏ కార్యక్రమం చేపట్టిన ను ప్రజాప్రతినిధుల, అధికారుల సహకారం తప్పనిసరి అని, జూన్ 3 నుండి 18 వరకు నిర్వహించు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అనీ,  వైకుంఠ దామాలను, సెగ్రిగేషన్ షెడ్ లను వాడకంలోకి తీసుకొని రావాలని,  ట్రాక్టర్ లు, సేగ్రిగేషన్ లో తయారైన ఎరువుల అమ్మకం ద్వారా ఆదాయం పెంచాలని తెలిపారు. ప్రతి వార్డ్ లో, ప్రతి గ్రామ పంచాయతీలో అభివృద్ధి వివరాల తో కూడిన ఫ్లెక్సీ ని ప్రదర్శించాలని తెలిపారు. ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కె. శశాంక మాట్లాడుతూ, జూన్ 3 నుండి జిల్లాలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించుటకు సన్నద్ధంగా ఉన్నామని, జిల్లాలో చేపట్టిన పల్లె ప్రగతి పనులను పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేరకు పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందేలా అధికారులు పనిచేయాలని అన్నారు.  మండల, గ్రామ స్థాయిల్లో అధికారులంతా గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సయుక్తంగా విధులు నిర్వహించి గ్రామీణాభివృద్ధిలో జిల్లా ఆదర్శంగా నిలిచేలా చూడాలని అన్నారు. గత నాలుగు దఫాలుగా నిర్వహించిన పల్లె ప్రగతి లో చేపట్టిన కార్యక్రమాలకు మౌలిక వసతులు ఏర్పాటు చేసుకుని వైకుంఠ ధర్మాలను, సెగ్రిగేషను షెడ్లను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొని రావాలని తెలిపారు. ప్రతి ఇంటికి ఓహెచ్ఎస్ఆర్ టాంక్ ల ద్వారా షెడ్యూలు ప్రకారం నీటి సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, గ్రామ పంచాయతీలో శానిటేషన్, ట్రాక్టర్ వాడకము, డ్రైనేజీ క్లీనింగ్, చెత్త సేకరణ కు ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలని ప్రతి ఇంటి నుండి రోజు విడిచి రోజు చెత్త సేకరణ జరిగే విధంగా చూడాలని వర్క్ షెడ్యూల్ ఏర్పాటు చేసుకుని మల్టీపర్పస్ గా ఉన్న సిబ్బందినివినియోగించాలని తెలిపారు. జిల్లాలో 32 క్రీడా ప్రాంగణాలు ప్రారంభించుటకు సిద్ధంగా ఉన్నాయని, మహబూబాబాద్ లో నాలుగు, మున్సిపాలిటీల్లో రెండు చొప్పున అర్బన్ లో 10 క్రీడాప్రాంగణం లను ప్రారంభించుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఎం.పి., ఎమ్మెల్సీ లు మాట్లాడారు. అనంతరం పల్లె ప్రగతి కార్యక్రమం 5వ విడత కార్యాచరణ రోజువారి నిర్వహించు కార్యక్రమాల వివరాలతో కూడిన పాంప్లెట్ ను మంత్రి ప్రజాప్రతినిధులు, కలెక్టర్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ అంగోతు బిందు, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మునిసిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, ఎంపిపి లు, జెడ్ పి టి సి లు., స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా పరిషత్ సీఈఓ రమాదేవి, డి.పి. ఓ. సాయి బాబా, ఎస్. ఈ. ఎన్పీడీసిఎల్ ఈ. ఈ. మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు., ఎం.పి. ఓ లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.