జెనీవాలో శ్రీలంకకు చుక్కెదురు

ఊచకోతపై నెగ్గిన అమెరికా తీర్మానం

అనుకూలంగా 25, ప్రతికూలంగా 13 శ్రీభారత్‌ అనుకూలం, పాక్‌ ప్రతికూలం

జెనీవా, మార్చి 21 (జనంసాక్షి):

శ్రీలంకలో మానవ హక్కుల హననానికి సంబంధించి అమెరికా ప్రతిపాదించిన తీర్మానానికి మెజారిటీ దేశాలు ఆమోదం తెలిపాయి. గురువారంనాడు జెనీవాలో ఐక్య రాజ్య సమితికి చెందిన మానవ హక్కుల మండలిలో శ్రీలంక చర్యలకు వ్యతిరేకంగా అమెరికా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై చర్చ, ఓటింగ్‌ జరిగింది. ఈ తీర్మానానికి అనుకూలంగా భారత్‌ సహా 25 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. పాకిస్తాన్‌ సహా 13 దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. మరో 8 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. శ్రీలంక యుద్ధ నేరాలపై ఈ తీర్మానం ప్రవేశపెట్టింది. తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ శ్రీలంకలో ఈ విషయానికి సంబంధించి ఇప్పటివరకు జరిగిన పురోగతిని గుర్తించామని, అయితే ఇది సరిపోదని, ఇంకా ఎన్నో చర్యలు చేపట్టాల్సి ఉందని అమెరికా పేర్కొంది. ప్రపంచ

వ్యాప్తంగా పెరుగుతున్న ఆందోళన దృష్ట్యా శ్రీలంక అర్ధవంతమైన చర్యలు తీసుకోవాల్సిందేనని అమెరికా పేర్కొంది. భారత్‌ ఈ అంశంపై మాట్లాడుతూ శ్రీలంకలో మరిన్ని జవాబుదారీతనంతో కూడిన చర్యలు అవసరమని, వీటిని మరింత విస్తృతంగా కొనసాగించాలని వాదన విన్పించింది. శ్రీలంక అంతర్జాతీయ సమాజాన్ని సంతృప్తి పరిచే విధంగా చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్టు పేర్కొంది. అమెరికా ప్రతిపాదించిన తీర్మానానికి ఎలాంటి సవరణలు సూచించలేదు. అయితే ముందుగా డిమాండు చేసినట్టుగా శ్రీలంకలో యుద్ధ నేరాలపై స్వతంత్ర, విశ్వసనీయ దర్యాప్తు జరపాలని మాత్రమే డిమాండు చేసింది. అమెరికా ప్రతిపాదించిన తీర్మానం శ్రీలంక నిర్మాణాత్మకంగా సంయమనంతో కొనసాగేందుకు అవకాశం లేనిదంటూ పాకిస్తాన్‌ ఆ తీర్మానాన్ని వ్యతిరేకించింది. మొత్తం మీద శ్రీలంకలో తమిళుల ఊచకోత వ్యవహారంపై అమెరికా ప్రతిపాదించిన తీర్మానానికి 25 దేశాలు అనుకూలంగా ఓటు వేయడంతో ఈ తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి ఆమోదించింది. జెనీవాలో జరిగిన ఈ పరిణామం శ్రీలంకకు ఎదురుదెబ్బేనని చెప్పవచ్చు. ఒక దేశానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితికి చెందిన మానవ హక్కుల మండలిలో ఇలా తీర్మానం ఆమోదం పొందడం నైతికంగా శ్రీలంకకు గట్టి గుణపాఠమే. తమ దేశంలో ఎలాంటి నరమేధం జరగలేదని, మానవ హక్కుల ఉల్లంఘన.. చట్టబద్ధమైన హక్కుల ఉల్లంఘన జరగలేదని,తామెలాంటి తప్పులకు పాల్పడ లేదంటూ శ్రీలంక ఇప్పటివరకు భావిస్తూ వచ్చింది. కాగా శ్రీలంకపై ఘాటైన పదజాలంతో సవరణలు చేసిన తీర్మానం ప్రవేశపెట్టాలని యుపిఎ ప్రభుత్వాన్ని డిఎంకె డిమాండు చేసింది. ఈ విషయంపై ప్రభుత్వంతో విభేదించి యుపిఎకు మద్దతు కూడా ఉపసంహరించుకుంది. డిఎంకె డిమాండు చేసినట్టు భారత్‌ ఎలాంటి సవరణలను ప్రతిపాదించకుండానే తీర్మానానికి ఆమోదం తెలిపింది. మొత్తం మీద ఈ వ్యవహారంలో భారత్‌ తీసుకున్న చర్యలు తమిళ పార్టీలను ఏ మేరకు సంతృప్తి పరుస్తాయో ఎదురు చూడాల్సి ఉంది.