జేఎన్‌యూలో పాక్ అనుకూల నినాదాలిచ్చిందెవరు?
– ఏబీవీపీ కార్యకర్తలేనంటూ ఆధారాలతో జాతీయ మీడియా కథనాలు
ఢిల్లీ ,ఫిబ్రవరి 15(జనంసాక్షి): బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ పాకిస్తాన్ అనుకూల నినాదాలపై రచ్చరచ్చ జరుగుతోంది. జేఏఎన్‌యూ ఆందోళన ముసుగులో ఏబీవీపీ కార్యకర్తలు పాకిస్తాన్‌ను సపోర్ట్ చేస్తూ చేసిన స్లోగన్స్ జాతీయ ఛానెల్స్ తో పాటు యూట్యూబ్‌లోనూ హల్‌చల్ చేస్తున్నాయి. ఏబీవీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఇతర విద్యార్థి సంఘాలపై ఆరోపణలు చేస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అందుకు వీడియోనే సాక్ష్యమని చెబుతున్నాయి. ఫిబ్రవరి 9, 2016..జేఎన్‌యూ క్యాంపప్, ఢిల్లీ..అఫ్జల్‌గురు ఉరిశిక్షపై పలు విద్యార్థి సంఘాల ఆందోళనలు…స్లోగన్స్..అవును..ఇవి పాకిస్తాన్ అనుకూల నినాదాలు..అది కూడా ఎక్కడో పాకిస్తాన్‌లో కాదు ఢిల్లీ జేఎన్‌యూ క్యాంపస్‌లో. వీరంతా ఎవరో తెలుసా ఏబీవీపీ కార్యకర్తలు. ఈ గుంపు నుంచే పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు వస్తున్నాయి. వీటికి స్పందనగా ఏబీవీపీ కార్యకర్తలు కూడా జిందాబాద్ , జిందాబాద్ అంటూ సపోర్ట్ చేస్తున్నారు. సర్కిల్ చేసిన స్టూడెంట్..ఈ విద్యార్థిని ఏబీవీపీ కార్యకర్తేనని చెప్పడానికి రుజువు ఇది. పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తున్న ఈ విద్యార్థి కూడా ఏబీవీపీ కార్యకర్తనే. సియాచిన్‌లో అమరుడైన హనుమంతప్పకు అనుకూలంగా నిర్వహించిన ర్యాలీలోనూ పాల్గొన్నాడు.
ఇతర విద్యార్థి సంఘాలపై నెపం..
ఏబీవీపీ కార్యకర్తలు పాకిస్తాన్ అనుకూల నినాదాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అఫ్జల్‌గురు ఉరిశిక్ష వ్యతిరేక ర్యాలీలో ఏబీవీపీ కార్యకర్తలు కూడా పాల్గొని, అందులో పాకిస్తాన్‌కు సపోర్ట్‌గా స్లోగన్స్ చేస్తూ, చివరికి ఆ నెపాన్ని ఇతర విద్యార్థి సంఘాలపై నెట్టారని విపక్షాలు మండిపడుతున్నాయి. జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని కన్హయ్య వంటి విద్యార్థి నేతలను అరెస్టు చేశారని విమర్శిస్తున్నాయి. ఇది కేవలం బీజేపీ, దాని అనుబంధ సంస్థ ఏబీవీపీ కుట్రేనని ఆరోపిస్తున్నాయి. ఏబీవీపీ కార్యకర్తల పాకిస్తాన్ అనుకూల నినాదాలు జాతి వ్యతిరేక చర్యలు కాదా అని నరేంద్ర మోడీ సర్కారును ప్రశ్నిస్తున్నాయి. వీరిని ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీస్తున్నాయి.