జేఎన్‌యూ విద్యార్థులకు 100కోట్ల జనం మద్ధతు
– హక్కులకోసం పాకులాడితే దేశద్రోహులా!?
– రోహిత్‌ను కూడా ఇలాగే అన్నారు
– విద్యార్థి అరెస్టును ఖండించిన రాహుల్
– జవహర్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులకు సంఘీభావం
న్యూఢిల్లీ,ఫిబ్రవరి 13(జనంసాక్షి): జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సీటీ విద్యార్థులకు దేశవ్యాప్తంగా వందకోట్ల మంది జనం మద్ధతు ఉందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహాల్ గాంధీ
అన్నారు. ‘ఈ దేశంలో భిన్న వాదనలు వినిపించడం నేరమైపోయింది. హక్కుల గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరినీ దేశ ద్రోహులుగా చిత్రీకరించే కుట్ర జరుగుతోంది. కొద్ది రోజుల కిందట హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ కుటుంబాన్ని పరామర్శించేందుకు హైదరాబాద్ వెళ్లాను. అతని స్నేహితులు, కుటుంబసభ్యులు నాకు చెప్పినదాన్నిబట్టి రోహిత్ ను కూడా దేశద్రోహిగా చిత్రీకరించారు. ఓ విద్యార్థి తన మనోభావాన్ని వ్యక్తపర్చినంత మాత్రాన దేశద్రోహి అవుతాడా?’ అంటూ ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ వర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి ఉద్వేగపూరితంగా ప్రసంగిచారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. శనివారం సాయంత్రం వర్సిటీకి చేరుకున్న ఆయనకు ఓ విద్యార్థి వర్గం నల్లజెండాలతో నిరసన తెలిపింది. మరో వర్గం విద్యార్థులు నిర్వహిస్తోన్న ఆందోళనకు మద్దతు పలికిన రాహుల్.. విద్యార్థులను దేశద్రోహం కేసుపై అరెస్టుచేయడాన్ని ఖండించారు. ‘నేను ఇక్కడికి వస్తున్నప్పుడు కొందరు నా ముఖంపై నల్లజెండాలు ఎగురవేశారు. ఆ చర్య నాకు సంతోషం కల్గించింది. ఎందుకంటే నన్ను వ్యతిరేకించేవారు తమ నిరసనను తెలియజేశారు. అది వారి హక్కు. ఇలాంటి హక్కే అందరికీ ఉంటుంది. ఎవరికివారు విభిన్నవాదనలు, విభిన్న ఆలోచనలు కలిగిఉన్నంతమాత్రాన వారిని తప్పుపట్టలేం’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.
హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులను అణిచివేస్తున్నవారే నిజమైన దేశద్రోహులని, ఇలాంటి చర్యల ద్వారా వారు మనల్ని(ఆందోళనకారుల్ని) మరింత సంఘటితపరుస్తున్నారని, గొంతువిప్పి స్వేచ్ఛగా తమ భావాలు చెబుతోన్న వ్యక్తులంటే ప్రభుత్వం భయపడుతున్నదని రాహుల్ గాంధీ అన్నారు. జేఎన్ యూ విద్యార్థుల స్వరంతో 100 కోట్ల మంది ఏకీభవిస్తారని, అవతలివారి వారు ఉద్దేశపూర్వకంగా నెలకొల్పిన ఉద్రిక్తతలకు ఆవేశపడొద్దని విద్యార్థులకు హితవుపలికారు.
కేంద్రం విద్యార్థులను వేధిస్తోంది
ఢిల్లోలోని జే.ఎన్.యూలో దేశానికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారన్న అంశం వివాదస్పదంగా మారుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఐదుగురు విద్యార్థులను అరెస్ట్ చేయగా? తాజాగా మరో ఏడుగురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. దేశ సమగ్రత దెబ్బ తినే విధంగా వ్యవహరించే వారిని వదిలేది లేదని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఐతే, విద్యార్థులెవరూ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయలేదని వామపక్షాల నేతలు స్పష్టం చేశారు. కావాలనే విద్యార్థులపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. లెఫ్ట్ పార్టీలు సహా జేడీయూ నేతలు ఈ అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశమయ్యారు. వర్సిటీల్లో కొంతమంది విద్యార్థులను కేంద్రం టార్గెట్ చేస్తోందని వారు ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.