జేసీ దివాకర్‌ రెడ్డి..  ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు


– పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు
– అనంతపురం లోక్‌సభ స్థానం ఫలితాలను నిలిపివేయాలి
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
అమరావతి, మే4(జ‌నంసాక్షి) : టీడీపీ నేత, అనంతపురం లోక్‌ సభ సభ్యుడు జేసీ దివాకర్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం నేత రామకృష్ణ కోరారు. ఈ మేరకు ఆయన శనివారం ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీకి లేఖరాశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జేసీ దివాకర్‌ రెడ్డి నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించారని ఆరోపించారు. అనంతపురంలో తన కుమారుడు జేసీ పవన్‌ రెడ్డి పోటీ చేసిన సందర్భంగా రూ.50 కోట్లు ఖర్చు పెట్టానని జేసీ దివాకర్‌ రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. ఒక్కో ఓటుకు రూ.2
వేలు ఇచ్చుకున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ఈసీ కానీ, అనంతపురం కలెక్టర్‌ గానీ ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ వ్యవహారంపై మేం పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అనంతపురం లోక్‌సభ ఎన్నికల ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఈ వ్యవహారంలో జేసీ దివాకర్‌ రెడ్డి నుంచి సాక్షులకు భద్రత కల్పించాలని కోరుతున్నామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ద్వివేదీ వేగంగా చర్యలు తీసుకుంటారని నమ్ముతున్నట్లు రామకృష్ణ తెలిపారు. ఇటీవల ఎన్నికల్లో గెలవడానికి కోట్లాది రూపాయలు ఖర్చుచేశామని జేసీ బహిరంగంగానే వ్యాఖ్యానించడంపై వైసీపీ, సీపీఐ పార్టీలు ఆయనపై ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఈసీ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన అనంతపురం జిల్లా తాడిపత్రి రిటర్నింగ్‌ అధికారి.. జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తాయని నిర్ధారించిన విషయం విదితమే.