జైపూర్‌లో ‘‘తల్లిపాల బ్యాంకు’’

6hkplsplరాజస్థాన్‌, మార్చి 31: శిశువుకు కావాల్సింది మందులే అయితే మార్కెట్‌లో కొనగలరు. సెలైన్‌ అయితే సెనక్లలో సమకూర్చగలరు. మరి తల్లిపాలు కావాలంటే ఏం చేయగలరు?. కన్నతల్లి పాలకు నోచుకోని పిల్లల కడుపు నింపడం ఎలా?. పుట్టిన నెలలోపే డబ్బా పాలు పట్టి రోగాలు రప్పించడం అవసరమా?. ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ‘‘తల్లిపాల బ్యాంకు’’. తల్లుల నుంచి పాలు సేకరించి.. భద్రపరిచి.. వాటిని అవసరమైన శిశువులకు అందించేందుకు జైపూర్‌లోని మహిళా చికిత్సాలయంలో ‘‘తల్లిపాల బ్యాంకు’’ ఏర్పాటైంది. నార్వేకు చెందిన ఓ ఎన్జీవో సంస్థ సహకారంతో రాజస్థాన్‌ ప్రభుత్వం ‘‘జీవన్‌ ధార’’ పథకం పేరిట ఈ బ్యాంకును సమర్థవంతంగా నిర్వహిస్తోంది. జైపూర్‌లో ఉన్న ఈ తల్లిపాల కేంద్రం దేశంలోనే రెండవదిగా గుర్తింపు పొందింది.

అప్పుడే పుట్టిన పసికందులకు తల్లిపాలను మించిన పోషకాహారం లేదు. ఎన్నో వ్యాధుల నుంచి శిశువుని కాపాడే శక్తి తల్లిపాలకు మాత్రమే ఉంది. ముఖ్యంగా బిడ్డ జన్మించగానే తల్లిపాలు పట్టిస్తే.. అవి అమృతంతో సమానం. కనీసం బిడ్డకు ఆరు నెలలు వచ్చేవరకైనా తల్లిపాలు తప్పనిసరిగా పట్టించాలి. అయితే కొందరు తల్లుల దగ్గర శిశువులకు పట్టించే పరిమాణంలో పాలు ఉండకపోవచ్చు. కొందరు శిశువులు పుట్టగానే అనారోగ్యంతో తల్లి చనిపోయి ఆనాథలుగా మారిపోయే ప్రమాదముంది. అలాంటి వారికోసమే జైపూర్‌ ఆస్పత్రిలో ‘‘జీవన్‌ ధార’’ కేంద్రం ఏర్పాటైంది. తల్లిపాలకు నోచుకోక దేశవ్యాప్తంగా 30 శాతం మంది పిల్లలు విగత జీవులవుతున్న తరుణంలో వారికి ఉచితంగా తల్లిపాలు అందిస్తున్నారు. పాలను డీప్‌ఫ్రీజర్‌లో దాచి పాలలో పోషకాలు తగ్గకుండా చూసుకుంటున్నారు.