జ‌ర భ‌ద్రం: పెట్రోల్ పంపుల్లో ఘ‌రానా మోసం

ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణ‌మైన పెట్రోల్ దందా వారు చేసే మోసాల గుట్టును ర‌ట్టు చేశారు పోలీసులు. పెట్రోలు మోసాలు పెరిగిపోతుండ‌టంతో ఆ రాష్ట్ర డీజీపీ సుల్కాన్ సింగ్ స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. సిట్ ల‌క్నోలోని ప‌లు పెట్రోల్ పంపుల్లో దాడులు నిర్వ‌హించ‌గా ఈ మోసం వెలుగు చూసింది.

పెట్రోల్ పంపు యాజ‌మాన్యాలు ఒక చిప్‌ను పెట్రోల్ మెషీన్‌లో ఏర్పాటు చేసి మోసాల‌కు పాల్ప‌డుతున్నార‌ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. వినియోగ‌దారుడు లీట‌ర్ పెట్రోలు ప‌ట్ట‌మంటే మెషీన్ మీద లీట‌ర్ పెట్రోలు క‌నిపిస్తుంద‌ని కానీ వాస్త‌వానికి త‌క్కువ పెట్రోల్ మాత్ర‌మే వాహ‌న ట్యాంక్‌లోకి వెళుతుంది. కానీ డ‌బ్బులు మాత్రం లీట‌ర్ పెట్రోల్‌కు చెల్లిస్తున్నారు వినియోగ‌దారులు. ఈ చిప్‌ను త‌యారు చేసిన సూత్ర‌ధారి రాజేంద‌ర్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారించ‌గా ఈ త‌ర‌హా చిప్‌లను 100కు పైగా పెట్రోల్ పంపులకు స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు ఒప్పుకున్నాడు.

సూత్ర‌ధారి రాజేంద‌ర్‌తో పాటు 22 పెట్రోల్ పంపుల య‌జ‌మానుల‌ను, అరెస్ట్ చేసి కేసు న‌మోదు చేశారు పోలీసులు. 15 ఎల‌క్ట్రానిక్ చిప్‌ల‌తో పాటు 29 రిమోట్ కంట్రోల్‌ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోసాల‌కు పాల్ప‌డుతున్న పెట్రోల్ పంపుల లైసెన్సుల‌ను ర‌ద్దు చేశారు. వినియోగ‌దారులు పెట్రోల్ ప‌ట్టుకునేందుకు వెళ్లిన‌ప్పుడు మెషీన్‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించాల‌ని అనుమానం క‌లిగితే ద‌గ్గ‌ర‌లోని పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయాల‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు.