టర్కీలో జంట పేలుళ్లు
– 86 మంది మృతి
హైదరాబాద్ అక్టోబర్10(జనంసాక్షి):
టర్కీలోని అంకారా రైల్వేస్టేషన్ సమీపంలో సంభవించిన జంట పేలుళ్లు ఘటనలో 86 మంది మృతి చెందినట్లు టర్కీ ¬ంశాఖ వెల్లడించింది. టర్కీ స్వదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం… అంకారాలోని రైల్వేస్టేషన్ సమీపంలో ఈ బాంబు పేలుళ్లు సంభవించాయి. మొదట స్వల్ప తీవ్రత గల బాంబు పేలుడు జరిగిందని, అనంతరం భారీ పేలుడు సంభవించిందని అధికారులు వెల్లడించారు. 62 మంది అక్కడికక్కడే మృతిచెందగా, మరో 24 మంది చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతిచెందారు. దాదాపు 186 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
టర్కీలో కుర్దు మిలిటెంట్లకు, ప్రభుత్వానికి మధ్య ఘర్షణలను వ్యతిరేకిస్తూ ప్రజలు శాంతి ర్యాలీ నిర్వహించేందుకు అక్కడికి చేరిన సమయంలో ఈ బాంబు పేలుళ్లు జరిగినట్లు మీడియా పేర్కొంది. దాడుల వెనుక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఘటన ఎవరు చేశారన్న దానిపై ఇప్పుడే ఎలాంటి ప్రకటనలు చేయలేమని, విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. నవంబర్ 1 నుంచి టర్కీలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ దాడులు కలవరం కలిగిస్తున్నాయని వెల్లడించింది.