టర్కీ భూకంపంలో 24కు చేరిన మృతుల సంఖ్య

– కొనసాగుతున్న సహాయక చర్యలు

ఇస్తాంబుల్‌,అక్టోబరు 31(జనంసాక్షి):టర్కీలో శుక్రవారం సంభవించిన భూకంపం ధాటికి మరణించిన వారి సంఖ్య 24కు చేరింది. దాదాపు 450 మందికి పైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతన్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. స్వల్ప గాయాలైన దాదాపు 364 మంది ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న ఇజ్మిర్‌ ప్రావిన్స్‌లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు భూకంపం వల్ల వేలాది మంది నిరాశ్రయులుగా మారారు. వారందరి కోసం ప్రభుత్వం పునరావాస ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రమాదంపై ఐక్యరాజ్య సమితి చీఫ్‌ ఆంటోనియో గుటెరస్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇజ్మిర్‌ ప్రావిన్స్‌, గ్రీకు ద్వీపమైన సామోస్‌ల మధ్య శుక్రవారం సాయంత్రం భూమి కంపించిన విషయం తెలిసిందే. సామోస్‌లోనూ నలుగురు స్వల్పంగా గాయపడగా, కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ సునావిూ హెచ్చరిక కూడా జారీ చేశారు. సామోస్‌కు 13 కిలోవిూటర్ల దూరంలోని ఏజీన్‌ వద్ద భూకంపం కేంద్రీకృతమయింది. 16.5 కి.విూ.లోతున భూమి పొరల్లో ఇది సంభవించింది. దీని తీవ్రత 6.6గా నమోదయింది.సెఫిరిసార్‌ ప్రాంతంలో స్వల్పంగా సునావిూ కూడా వచ్చింది. బాగా లోతులో భూకంపం వచ్చినందున భూమిలో సర్దుబాట్లు జరుగుతాయని, అందువల్ల కొద్ది వారాల పాటు ప్రకంపనల ప్రభావం ఉంటుందని నిపుణులు తెలిపారు. భూకంపం కారణంగా దెబ్బతిన్న భవనాల్లోకి వెళ్లకూడదని హెచ్చరించారు.