టవరు చూస్తే అంత… పూనాది చూస్తే చింత
ఖమ్మం, డిసెంబర్ 29 (): ఏజెన్సీ ప్రాంతంలో సెల్ సేవలు విస్తరిస్తున్నాయి. ఓవైపు ఇది శుభపరిణామం కాగా మరోవైపు కంపెనీల బాధ్యతారాహిత్యం వల్ల పలు అనర్థాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. సెల్ కంపెనీలు నిబంధనలు పాటించకుండా టవర్లను ఏర్పాటు చేస్తుండడంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని అశోక్‌నగర్ కాలనీలో నివాస ప్రాంతాల మధ్య నెలకొల్పిన సెల్‌టవర్ స్థానికులకు శాపంగా మారింది. ఈ టవర్‌ను ఇక్కడ నెలకొల్పేందుకు అధికారుల నుండి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. నేలపై నుండి బలమైన పునాదితో నిర్మించాల్సి ఓవర్‌ను ఓ రెండంతస్తుల భవనంపై నెలకొల్పారు. పటిష్టమైన పునాది లేకపోవడంతో ఈ టవర్ నేలకొరిగే ప్రమాదం స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అంతేకాక ఈ టవర్ పక్కనే కరెంట్ తీగలు ఉండడంతో గాలిదుమ్ము, తుపాన్‌కు టవర్ నేలకొరిగి ఈ తీగలు ఇండ్లపై పడితే పెను ప్రమాదం సంభవిస్తుంది. టవర్ నుండి వెలువే వైబ్రేషన్స్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉన్న వారిపై పడి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టవర్‌కు ప్రత్యేకంగా త్రీపేస్ విద్యుత్ సౌ కర్యం కల్పించాల్సి ఉండగా నిబంధనలకు విరుద్దంగా ఇండ్లకు సరఫరా అయ్యే విద్యుత్ తీగల నుండే కరెంట్ సప్లై చేస్తున్నారు. సెల్ కంపెనీల వారు ఊరిచివర నిర్మించాల్సిన టవర్‌ను పట్టణంలోని భవంతిపై నెలకొల్పడం ఆ భవనాల యజమానులకు ఆర్థికంగా లాభం చేకూర్చినా చుట్టుపక్కల వారికే కాక వారికి సైతం అది ప్రమాదకారిగా పరిణమించే అవకాశం ఉంది. నివాస ప్రాంతాల మధ్య కొద్దికాలం క్రితం నెలకొల్పిన ఈ టవర్‌ను అక్కడి నుండి తొలగించాల్సిందిగా స్థానికులు సబ్ కలెక్టర్, తహశీల్దార్, మున్సిపల్ అధికారులకు విన్నవించినప్పటికీ స్పందన లేకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.