టిఆర్‌ఎస్‌లో చేరుతున్న యువత
కెసిఆర్ గెలుపు చారిత్రక అసవరం: కొప్పుల
జగిత్యాల,సెప్టెంబర్10(జనంసాక్షి): టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఎంతోమంది స్వచ్ఛందంగా పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ అన్నారు. టీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందనీ అన్నారు. అందుకే అనేకులు టిఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. కేసీఆర్ నాయకత్వం చారిత్రక అవసరమని ఈశ్వర్ పేర్కొన్నారు. ఆరుదశాబ్దాల పాలనలో తెలంగాణను కాంగ్రెస్, టీడీపీ పూర్తిగా భ్రష్టుపట్టించాయనీ, ఈ ప్రాంత నిధులు, నీళ్లు, ఉద్యోగాలు, వనరులు దోచి అభివృద్ధికి దూరంగా, సంస్కృతి లేని ప్రాంతంగా మార్చివేశాయని ధ్వజమెత్తారు. నాలుగున్నరేళ్లలో కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు ప్రపంచం నివ్వెరపోయే పాలనను అందించిందని పునరుద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులను గొప్ప మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు కేసీఆర్ నాయకత్వం చారిత్రక అవసరమని పేర్కొన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణను సాధించారనీ, నాలుగున్నరేళ్ల వ్యవధిలో ప్రపంచం మెచ్చుకునేలా గొప్ప పాలనను అందించారని గుర్తుచేశారు. జిల్లాలో రూ.వేల కోట్లతో ఎస్సారెస్పీ రివర్స్ పంపింగ్, బోర్నపెల్లి వంతెన, రోళ్లవాగు ఆధునికీకరణను
చేపట్టారన్నారు. కల్యాణలక్ష్మి, ఒంటరి మహిళలకు పింఛన్లు, ప్రవాసీ విద్యా పథకం, రెసిడెన్షియల్ స్కూల్స్, సర్కారు వైద్యశాలల్లో నమ్మకమైన సేవలు, కేసీఆర్ కిట్, రైతుబంధు, పెట్టుబడి సాయం, రైతులకు బీమా తదితర వందలాది పథకాలను రూపొందించి పారదర్శకంగా అమలు చేస్తున్నామన్నారు.