టిఆర్‌ఎస్‌ గెలుపు లక్ష్యంగా వ్యూహం

నిరంతరం కార్యకర్తలతో ఎర్రబెల్లి చర్చలు

జనగామ,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు కోసం అన్ని గ్రామాలు, శివారు తండాలు, ఆవాస ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులంతా సమన్వయంతో పని చేయాలని మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ప్రతిపక్ష పార్టీల గుండెల్లో దడ పుట్టించాలని అన్నారు. టిఆర్‌ఎస్‌ అభ్‌ర్థులను గెలిపించేందుకు ప్రతి గ్రామంలో కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఆయన అన్ని గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులు, పార్టీ ఏరియా కన్వీనర్లు, గ్రామాల సమన్వయ సమితిల ప్రతినిధులతో నిరంతరం సవిూక్ష చేస్తున్నారు. ప్రత్యేకంగా తన నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలతో గ్రామాల వారీగా విడివిడిగా మాట్లాడారు. అన్ని గ్రామాల్లో పార్టీ బలాబలాలు, ప్రతిపక్ష పార్టీలకు ఉన్న ఆదరణ, నాయకులు పని చేస్తున్న విధానాలు, ప్రజలకు అందించాల్సిన సేవా కార్యక్రమాలు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులపై విస్తృతంగా చర్చించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలంటే క్రమశిక్షణకు మారుపేరన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తారని తెలిపారు. అలసత్వం ప్రదర్శించే నాయకులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎర్రబెల్లి సతీమణి ఉషాదయాకర్‌రావు కడా గ్రామాల్లో తిరుగుతూ కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారు.