టిఆర్‌ఎస్‌ పటిష్టత కోసం కార్యాచరణ

నిజామాబాద్‌,మార్చి25  : జిల్లాలో టిఆర్‌ఎస్‌ పటిష్టత కోసం కార్యాచరణ చేస్తున్నారు. అడహ్‌కమిటీలు వేసుకుని ముందుకు సాగుతన్న వారు పార్టీ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభించింది. దీంతో సభ్యత్వ నమోదులో రాష్ట్రంలో రెండో స్థానంలో జిల్లా నిలిచింది.  పార్టీ జిల్లాలో పటిష్టంగా ఉన్నందున నిజామాబాద్‌ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెరాస అవిర్భావం నుంచి పని చేసిన వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు. క్రీయాశీలకంగా పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. కమిటీల ఎన్నికకు సంబంధించి అడహాక్‌ కమిటీ సభ్యులకు సూచనలు చేశారు.పార్టీ కమిటీల ఎన్నికలను పకడ్బందీగా చేపట్టాలని, పార్టీ కోసం పని చేసిన వారికి కమిటీల్లో భాగస్వామ్యం కల్పించాలని  పేర్కొన్నారు. పార్టీ కోసం పని చేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. మంగళవారం రాత్రి కామారెడ్డిలో తెరాస పార్టీ అడహాక్‌ కమిటీ సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరై పోచారం మాట్లాడుతూ..  పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ధేశిరచిన లక్ష్యం కంటే రెట్టింపు స్థాయిలో కార్యకర్తలు కష్టపడి సభ్యత్వ నమోదు చేయించారన్నారు. ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో గ్రామ, పట్టణ కమిటీలతో పాటు అనుబంధ కమిటీలు వేసుకోవాలన్నారు. ఇందుకోసం గ్రామ కార్యకర్తలకు ముందుగానే సమాచారం అందించి అక్కడకు వెళ్లి కమిటీలు వేయాలని అడహాక్‌ కమిటీ సభ్యులకు సూచించారు. పార్టీకి గ్రామకమిటీలు కీలకమని, ఎలాంటి లోపాలకు అస్కారం ఇవ్వకుండా కమిటీల నియామకం జరగాలన్నారు. ఏప్రిల్‌ 6 నుంచి 12 వరకు మండల కమిటీల ఎన్నిక ఉంటుందన్నారు. మండల, జిల్లా కమిటీల ఎన్నిక తర్వాత రాష్ట్రకమిటీ సమావేశం ఉంటుందని ఆతర్వాత వచ్చే నెల 27న పరేడ్‌ మైదానంలో బహిరంగ సభ జరుగుతుందన్నారు. పట్టణంలో వార్డును యూనిట్‌గా, కార్పొరేషన్‌లో మూడు పోలింగ్‌బూత్‌లను ఒక యూనిట్‌గా తీసుకొని కమిటీలు వేయాలన్నారు. నిజామాబాద్‌ ఎంపీ కవిత,జహీరాబాద్‌ ఎంపీ బీబీపాటిల్‌, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌,  ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌, హన్మంత్‌ షిండే, జీవన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, షకీల్‌, ఎమ్మెల్సీలు గంగాధర్‌/-నడ్‌, రాజేశ్వర్‌లతో పాటు జిల్లా, మండల అడహాక్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పార్టీ నిర్ణయాల మేరకు నడుచుకుంటామని ఈ సందర్భంగా అడహక్‌ కమిటీ సభ్యులు తెలిపారు.