టిఆర్‌ఎస్‌ మాత్రమే మన ఇంటి పార్టీ

చంద్రబాబుతో జతకట్టి ఓట్ల కోసం వస్తున్నారు

కూటమి నేతలను తరిమి కొట్టండి

ఇంద్రకరణ్‌ సమక్షంలో పార్టీలో చేరికలు

నిర్మల్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే టీడీపీతో కాంగ్రెస్‌ పార్టీ జత కట్టిందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి పేర్కొన్నారు. వీరు కూటమి కట్టినంత మాత్రాన టిఆర్‌ఎస్‌ పార్టీకి వచ్చే నష్టమేవిూ లేదన్నారు. ఈ సారి కూడా రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. సోన్‌ మండలం గంజాల్‌కు చెందిన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. వారందరికీ మంత్రి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వృద్ధులు, వికలాంగులకు పెన్షన్‌ ఇవ్వడం, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లాంటి పథకాలతో ప్రజలు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. మహాకూటమి మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. వీరు స్వార్థ రాజకీయం కోసం, తెలంగాణ ప్రయోజనాలను అడ్డుకోవడానికే కూటమి కట్టారని అన్నారు. మహా కూటమి కుట్రలను పన్నాగాలను తిప్పికొట్టాలని కోరారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌ ఓర్వలేకపోతోందని,ఆంధ్ర పార్టీ టీడీపీతో జతకట్టి చంద్రబాబుకు దాసోహమైందని అల్లోల విరుచుకుపడ్డారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. టీఆర్‌ఎస్‌ ఒక్కటే తెలంగాణలో మన ఇంటి పార్టీ అని… మిగిలిన పార్టీలన్ని తెలంగాణ వ్యతిరేక పార్టీలని ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆంధ్రాకు వత్తాసు పలికినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తన అభ్యర్థిత్వానికి మద్దతు పలుకాలని కోరరు. కారు గుర్తుకు ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు. నాలుగేండ్లలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి ప్రజలకు జీవన ప్రమాణాలను మెరుగుపరిచిందన్నారు. సీఎం కేసీఆర్‌ పేదలు, రైతుల పక్షపాతి అని, వారి సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. కేసీఆర్‌ మరోసారి సీఎం కావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు ఒంటరి మహిళలను ఎన్నడూ పట్టించుకోలేదని, వారిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గుర్తించి పింఛన్లు ఇస్తుందని అన్నారు. తెలంగాణకు బద్ద శత్రువైన టీడీపీతో, ఇతర పార్టీలతో కాంగ్రెస్‌ మహా కూటమి కట్టి ఓట్లు అడిగేందుకు వస్తున్నారని వారిని తరిమివేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.