టిఆర్‌ఎస్‌ లక్ష్యంగా కాంగ్రెస్‌ ఉధృత ప్రచారం

 

అభ్యర్థులు ఖరారు కాకున్నా ఆగని ఎన్నికల జోరు

ఆదిలాబాద్‌,అక్టోబర్‌29(జ‌నంసాక్షి): తాజా పరిణామాల నేపథ్యంలో రాజకీయ సవిూకరణాలు మారుతున్నాయి. ఇన్నాళ్లూ ఏకపక్షంగా సాగిన జిల్లా రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టీఆర్‌ఎస్‌ టికెట్ల కేటాయింపు తరువాత చోటు చేసుకున్న పరిణామాలను కాంగ్రెస్‌ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ఉమ్మడి జిల్లాలోని మెజారిటీ సీట్లపై కన్నేసి ప్రచారంలో దూసుకుని పోతోంది. పొత్తుల లెక్కలు తేలకపోయినా… టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోకుండా వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో ముఖ్య నాయకులు ఎక్కడెక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయంలో కొంత క్లారిటీ వచ్చింది. డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తోపాటు టిక్కెట్లు ఆశిస్తున్న కాంగ్రెస్‌ నేతలు ఊరూవాడా టిఆర్‌ఎస్‌ లక్ష్యంగా ప్రచారంలో దూసుకుని పోతున్నారు. తెలంగౄణ ప్రజలకు ఇచ్చిన హావిూల వైఫల్యానలు ప్రస్తావిస్తున్నారు. పార్టీలో మహిళలకు గౌరవం లేదని చెప్పుకొచ్చారు. ఒక్కరికి కూడా మంత్రివర్గంలో స్థానం లేకుండా చేశారని అన్నారు. ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్తులపై గాలం వేసి ఫలితాలు రాబడుతోంది.ఎవరికి వారే తమ వంతు ప్రచారం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌లో రాజకీయంగా ఎదిగి తెలంగాణ ఉద్యమం సమయంలో, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్‌లో చేరిన నాయకులను సవిూకరిస్తున్నారు. మరోవైపు కొందరు టీఆర్‌ఎస్‌ అసంతృప్తి నాయకులు రహస్య సమావేశం ఏర్పాటు చేసి సమాలోచనలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి మరికొందరు నాయకులు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న నాయకులు కాంగ్రెస్‌ వైపు దృష్టి సారించినట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నిర్మల్‌ నుంచి పోటీ ఖరారైంది. ఆయన

ఇప్పటికే నిర్మల్‌లో ప్రచారం ప్రారంభించారు.అభ్యర్థులు ఖరారైనా… ఫ్లాష్‌ సర్వే, స్కీన్రింగ్‌ కమిటీల ద్వారా అందిన నివేదిక ప్రకారమే ఏఐసీసీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తుంది. కూటమిలో తెలుగుదేశం, సీపీఐ, టీజేఎఫ్‌ పార్టీలు చేరడం ఇప్పటికే ఖరారైంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక సీటు తప్ప వదులుకునేది లేదని జిల్లా కాంగ్రెస్‌ నాయకత్వంతో పాటు ఆయా నియోజకవర్గాల్లోని నాయకులు చెబుతున్నారు.