టిడిపికి వంటేరు ప్రతాప్‌రెడ్డి రాజీనామా
గజ్వేల్,మే12(జనం సాక్షి ): తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు, సిద్దిపేట జిల్లా తెదేపా అధ్యక్షుడిగా కొనసాగుతున్న వంటేలు ప్రతాప్‌రెడ్డి తెలుగుదేశం పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేశారు. శనివారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడేందుకు అనువైన పార్టీలో చేరి ప్రజల పక్షాన నిలబడతానన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, పార్టీ స్థాపించిన ఎన్‌టీరామారావు అంటే తనకెంతో అభిమానమని, కార్యకర్తల అభీష్టం మేరకే పార్టీని వీడుతున్నట్లు ఆయన చెప్పారు. గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించి తెలంగాణాకు విముక్తి కలిగిస్తానని ఆయన తెలిపారు. మండలపార్టీ అధ్యక్షులు, తెదేపా కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు ఆయన బాటలోనే తెదేపా సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరే అవకాశాల ఉన్నాయి. గతంలో రెండుసార్లు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.