టిడిపిని ఆదుకోనున్న అన్నదాతా సుఖీభవ

పథకంతో ప్రజల్లో సానుకూల భావన
అమరావతి,మార్చి29(జ‌నంసాక్షి): అన్నదాతా సుఖీభవ  పథకం కింద పెట్టుబడి రాయితీ దళారుల చేతుల్లోకి వెళ్లకుండా నేరుగా కర్షకుల ఖాతాలకే జమ చేసే విధానాన్ని అమలులోకి తీసుకువచ్చి పారదర్శకతకు పెద్దపీట వేయడంతో ఇప్పుడు టిడిపికి కలసి వస్తోంది. రైతులు ఈ పథకం పట్ల ఆరకర్శితులు అవుతున్నారు. ఈ పథకంతో కొద్దిగా టిడిపివైపు మొగ్గు పెరిగింది.  రైతులను ఆదుకోవడానికి పంటకు ముందు పెట్టుబడి నిధి కింద అన్నదాత సుఖీభవ పథకంతో ఖరీఫ్‌ సీజన్‌కు ముందుగానే డబ్బులు ఇచ్చే పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్రం కూడా ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ఒక్కొక్కరికి రూ.6 వేలు అందిస్తోంది. అయితే కేంద్రం దీనిని ఐదెకరాలలోపు వారికే వర్తింపజేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం పరిమితి విధించకుండా కుటుంబానికి రూ.10 వేల చొప్పున మూడు విడతల్లో జమ చేస్తోంది. తొలివిడతగా వారి ఖాతాలకు రూ.1000 వంతున జమ చేసింది. కేంద్రం ఇచ్చే రూ.6 వేలతోపాటు సన్నకారు రైతులకు రాష్ట్రం మరో రూ.9 వేలు జమచేసి రూ.15 వేలు అందించనుంది.పంటల ధరలు పతనమైనప్పుడు అదనపు ధర పథకం అమలుచేసి నేరుగా సాయం అందజేసింది.  వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గత ఐదేళ్లలో ప్రభుత్వం సాగుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. రైతులకు విత్తనాలు, ఎరువులు, రసాయనాలు అందుబాటులో ఉంచడంతోపాటు యాంత్రీకరణకు పెద్దఎత్తున నిధులు విడుదల చేసింది. వారిని రుణవిముక్తులను చేయడానికి పథకం కూడా అమలు చేసింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఉదారంగా సాయం అందించి ఆదుకుంది.  కౌలు రైతులు వ్యవసాయం చేస్తుండటంతో వారికీ రుణాలు ఇప్పించి ప్రైవేటు వ్యాపారుల వద్దకు వెళ్లకుండా వెసులుబాటు కల్పించింది.
భూసార పరీక్షల ఫలితాలను అనుసరించి ఎరువులు వినియోగించేలా వారికి అవగాహన కల్పించారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని అందుకు అనుగుణంగా ఎరువులు, రసాయనాలు రాయితీపై పంపిణీ చేశారు. ప్రభుత్వం రెండేళ్ల నుంచి రైతులకు రాయితీపై ట్రాక్టర్లు పంపిణీ చేస్తోంది. వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా కూలీల ఖర్చును తగ్గించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా రైతురథం పథకం ప్రవేశపెట్టి వారికి ట్రాక్టర్లను అందించగా వ్యవసాయంలో ప్రతి పనికీ వాడుకునే వెసులుబాటు చిన్న, సన్నకారు రైతులకు
కలిగింది. యంత్ర పరికరాలు కూడా రాయితీపై ఇవ్వడంతో కూలీల ఖర్చు తగ్గి లాభసాటి సాగు వైపు పయనిస్తున్నారు. వరి కోతల సమయంలో యంత్రాలను యాప్‌ ద్వారా విరివిగా ఉపయోగించుకున్నారు.