టిడిపి దళిత గర్జనపై ఉక్కుపాదం
అనుమతించి రద్దుచేసిన పోలీసులు
ఎక్కడిక్కడే టిడిపి నేతల గృహనిర్బంధం
పోలీసుల తీరుపై ఎస్సీ సెల్ నేతల ఆగ్రహం
ధర్నాచౌక్ వద్ద ట్యాంక్ నిరసన చేపట్టిన నేతలు
ధర్నాచౌక్ వద్ద భారీగా మొహరించిన పోలీసులు
విజయవాడ,జూలై26(జనంసాక్షి): విజయవాడలో టిడిపి ఎస్సీ సెల్ నాయకులు చేపట్టిన దళిత గర్జన ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి నిరాకరించారని ఎస్సీ సెల్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్జనపై అనుమతి ఇవ్వకపోవడంతో ధర్నాచౌక్ వద్ద ఆందోళనలు చేపట్టారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రద్దు చేసిన.. దళితోద్ధరణ పథకాలు పునరుద్ధరించాలంటూ.. తెలుగుదేశం విజయవాడలో తలపెట్టిన దళితగర్జనపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. దాంతో తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో పలువురు నాయకులు ధర్నా చౌక్ వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. ధర్నాకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చిన పోలీసులు.. ఇప్పుడు నిరాకరించారని రాజు తెలిపారు. వైకాపా ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు. అయితే వాటర్ ట్యాంక్ ఎక్కిన తెదేపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబును పోలీసులు గృహ నిర్బంధించారు. విజయవాడలో తెదేపా ఎస్సీ సెల్ నాయకులు నిర్వహిస్తున్న దళిత గర్జనకు వెళ్లకుండా ఆనందబాబును అడ్డుకున్నారు. నక్కా ఆనందబాబు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బాపట్ల జిల్లాలోని ఏలూరి సాంబశివరావు క్యాంప్ ఆఫీస్ వద్ద పోలీసులు మోహరించారు. క్యాంప్ ఆఫీస్‌లో ఉన్న ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి, తెదేపా ఎస్సీ సెల్ నాయకుడు సురేష్‌లను పోలీసులు గృహనిర్బంధించారు. నందిగామలో తెదేపా నాయకురాలు తంగిరాల సౌమ్యను పోలీసులు గృహ నిర్బంధించారు. విజయవాడలో దళిత గర్జనకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు సంబంధించి 27 పథకాలు రద్దు చేశారని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. మంగళవారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ దళితుల ఓట్లతో గెలిచి.. వారికే ద్రోహం చేశారని విమర్శించారు. అంబేద్కర్ పేరిట విదేశీ విద్యా దీవెన పథకం పెడితే దాని పేరు మార్చారని, అంబేద్కర్ పేరు మార్చే దుర్మార్గపు పని జగన్ తప్ప ఎవరూ చేయలేరన్నారు. దళితులకు రూపాయి కూడా రుణం ఇవ్వని ముఖ్యమంత్రి… కార్పొరేషన్లను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. దళిత గిరిజనులకు ఒక్క పథకం కూడా లేకుండా రద్దు చేశారని మండిపడ్డారు. దళితుల హక్కుల కోసం టీడీపీఆందోళనకు పిలుపిస్తే అడ్డుకున్నారని, పోలీసులు తన ఇంటికి వచ్చి నిర్బంధించారన్నారు. ఎందుకు అడ్డుకున్నారో పోలీసులు చెప్పటం లేదన్నారు. తన ప్రాథమిక హక్కులను (ఈబీనిటజీప।నిబిజీ సతిణఠబిబ) పోలీసులు హరిస్తున్నారని, ఎవరూ చెబితే పోలీసులు మమ్మల్ని ఆపుతున్నారు?.. ముఖ్యమంత్రా? లేక సజ్జల ఆదేశాలతో పని చేస్తున్నారా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కూడా పోలీసులను అడ్డు పెట్టుకుని దౌర్జన్యాలు చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో దళితులపై దాడులు అడ్డగోలుగా పెరిగాయని నక్కా ఆనందబాబు తీవ్ర స్థాయిలో
విమర్శించారు. విజయవాడలో దళిత గర్జన నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమాతో సహా పలువురు తెలుగుదేశం నేతలను గృహనిర్బంధం చేశారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ధర్నా చౌక్ వచ్చే పలు రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ… ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చిందని, దళితులపై దాడులు నిత్వకృత్యమయ్యాయని మండిపడ్డారు. మూడేళ్ళ పాలనలో జగన్ ఎస్సీలకు మొండి చేయి చూపించారన్నారు. దళితుల కోసం కేటాయించిన వేలకోట్ల సబ్‌ప్లాన్ నిధులను వైసీపీ పాలకులు దారిమళ్లించారని ఆరోపించారు. తిరిగి ఆ నిధులన్నింటినీ రాబట్టి దళితుల సంక్షేమానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్సీల కోసం గతంలో అమలు చేసిన భూమి కొనుగోలు పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. అంబేద్కర్ విద్యా స్కీంలను జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిలిపివేసిందన్నారు. దళితులంతా చైతన్యవంతులై జగన్ సర్కార్‌పై సమరశంఖం పూరించాలని దేవినేని ఉమా పిలుపునిచ్చారు. ఈ క్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దళిత గర్జనకు వెళ్లనీయకుండా బోండా ఉమాను గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దళితగర్జన జరిగితే జగన్ రెడ్డి దళితులకు చేస్తున్న మోసాలు బయట పడతాయనే సీఎం భయమని అన్నారు. దళిత సోదరులు జగన్ రెడ్డి మోసాలు గ్రహించాలని తెలిపారు. కోర్టులు ముందస్తు నిర్బంధాలు చేయద్దు అన్నా ప్రభుత్వ వత్తిడితో పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. దళితులకు జగన్ రెడ్డి ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుహయాంలో దళితులకు స్వర్ణ యుగం అని బోండా ఉమా పేర్కొన్నారు. సీపీ రద్దు చేసిన 27 ఎస్సీ సంక్షేమ స్కీంల అమలు కోసం తెలుగు దేశం పార్టీ నిర్వహించే శాంతియుత ధర్నాలను వైసీపీ ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు మండిపడ్డారు. ఎస్సీలకు న్యాయంగా ఉన్న 27 స్కీంలను రద్దు చేయకపోతే అసలు ధర్నాలే ఉండవు కదా అని అన్నారు. 27 ఎస్సీ స్కీంలను రద్దు చేయడం, వాటి కోసం ఉద్యమిస్తున్న వారిని అరెస్ట్ చేయడం చూస్తూంటే వైసీపీ విధానం దళిత వ్యతిరేక విధానం అని స్పష్టంగా అర్థమవుతోందని దేవతోటి నాగరాజు పేర్కొన్నారు.