టిప్పు సుల్తాన్‌ అమరవీరుడు

– ఆంగ్లేయులకు వ్యతిరేకంగా విరోచితంగా పోరాడిండు

– యుద్ధభూమిలో అమరుడయ్యాడు

– రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

కర్ణాటక,అక్టోబర్‌ 25,(జనంసాక్షి): టిప్పు సుల్తాన్‌ జయంతి వేడుకల వివాదం కర్ణాటకలో తారాస్థాయికి చేరిన నేపథ్యంలో రాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలు బీజేపీ నేతలకు షాకిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్‌ సర్కారు టిప్పు జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధపడుతుండగా.. బీజేపీ మాత్రం నిరసిస్తోంది. కానీ రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ మాత్రం టిప్పు సుల్తాన్‌ను పొగుడుతూ మాట్లాడారు. కర్ణాటక విధాన సభ వజ్రోత్సవాల సందర్భంగా.. ఆ రాష్ట్ర ఉభయ సభలను ఉద్దేశించి రామ్‌నాథ్‌ మాట్లాడారు. ఈ సందర్భంగానే.. టిప్పు సుల్తాన్‌ బ్రిటిషర్లతో పోరాడుతూ ప్రాణాలు వదిలాడని, ఆయన గొప్ప స్వాతంత్య సమరయోధుడని రాష్ట్రపతి చెప్పుకొచ్చారు. ప్రపంచంలో తొలి యుద్ధ రాకెట్‌కు రూపకల్పన చేసిన ఘనత టిప్పు సుల్తాన్‌కే దక్కుతుందన్నారు. యుద్ధ రంగంలో మైసూరు రాకెట్ల తయారీకి ఆయన ఆద్యుడని, ఈ సాంకేతికతనే తర్వాత బ్రిటిషర్లు స్వీకరించారని రాష్ట్రపతి చెప్పారు. ప్రథమ పౌరుడు చేసిన వ్యాఖ్యలకు కర్ణాటక కాంగ్రెస్‌ నేతలు ఫుల్‌ ఖుషీ అయ్యారు. బల్లాల్ని చరుస్తూ.. హర్షం వ్యక్తం చేశారు. నవంబర్‌ 10న కర్ణాటక ప్రభుత్వం టిప్పు సుల్తాన్‌ జయంతి వేడులకను ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది. మరుసటి ఏడాది కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు బీజేపీ నేతలు టిప్పు జయంతి వేడుకల్ని బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. కర్ణాటక వచ్చిన సందర్భంగా రాష్ట్రపతి కన్నడ రాజకీయ నాయకుల గురించి ప్రస్తావించారు. మాజీ సీఎంలు నిజలింగప్ప, దేవరాజ్‌ ఉర్స్‌, బీడీ జెట్టి, రామకృష్ణ హెగ్డే, ఎస్‌ఆర్‌ బొమ్మై, వీరేంద్ర పాటిల్‌, ఎస్‌ఎం కృష్ణలపై ప్రశంసలు గుప్పించారు. దేవే గౌడ మాజీ ప్రధాని మాత్రమే కాదని, తనకు మంచి మిత్రుడని కోవింద్‌ తెలిపారు.