టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం
– మరోసారి ఆశీర్వదిస్తే నిర్మల్ ముఖచిత్రాన్ని మురుస్తా
– మహాకూటమి ముసుగులో మాయగాళ్లు వస్తున్నారు
– వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
– ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
– నిర్మల్ పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆపద్ధర్మ మంత్రి
నిర్మల్, అక్టోబర్25(జనంసాక్షి) : టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని, మరోసారి ప్రజలంతా ఒకేతాటిపైకి వచ్చి ఆశీర్వదించాలని ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గురువారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత భంగల్ పేట్ లో గురువారం ఉదయం ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు చేసి అనంతరం ప్రచారాన్ని మొదలుపెట్టారు. టీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మరోసారి కేసీఆరే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలన్నారు. గత పాలకులు 60ఏళ్లలో చేయని అభివృద్ధి, నాలుగేళ్లలో కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు. కేసీఆర్ ప్రతి ఇంటికీ తాగునీరు ఇస్తున్నారని, కేసీఆర్ కిట్ల వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు చేకూరుతోందని వివరించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి గ్రామాల్లో టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. నిర్మల్ పట్టణాన్ని, నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నానని, మరోసారి ఆశీర్వదిస్తే నిర్మల్ ముఖ చిత్రాన్ని మారుస్తానని చెప్పారు. మహాకూటమి ముసుగులో మాయగాళ్లు వస్తున్నారని, మాయగాళ్ల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ములేక.. ఆంధ్రా పార్టీతో పొత్తుపెట్టుకొని ప్రజల ముందుకొస్తుందని అన్నారు. చంద్రబాబు నాయుడు తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకొనే వ్యక్తి అని అలాంటి వ్యక్తి పార్టీతో పొత్తు పెట్టుకొని మరోసారి తెలంగాణను ఆంధ్రా చేతుల్లో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్నారు. అలాంటి కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం కేసీఆర్ నాలుగేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, మళ్లీ అవి కొనసాగి బంగారు తెలంగాణగా మార్చుకొనేందుకు కేసీఆర్‌కే మద్దతుగా నిలవాలని ప్రజలను ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో బంగాళ్ పేట్‌లో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, టీఆర్‌ఎస్ సీనియర్ నేత శ్రీహరి రావు, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.