టీఆర్ఎస్లోకి కౌశిక్ హరి ..?
– అధిష్టానం పిలుపుతో తెలంగాణ భవన్కు
– రేపో..మాపో అధికారికంగా చేరిక
– ఛక్రం తిప్పిన తాజా మాజీ ‘సోమారపు’
గోదావరిఖని, నవంబర్ 11, (జనంసాక్షి) :
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత, రామగుండం పట్టణానికి చెందిన కౌశిక హరి టీఆర్ఎస్లో చేరబోతున్నారు. టీఆర్ఎస్ అధిష్టానం పిలుపుమేరకు ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఇక రేపో… మాపో టీఆర్ఎస్ పార్టీలో అధికారికంగా తన అనుచరులతో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో చేరడానికి సుగమం అయ్యింది. రామగుండం నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ చేరికకు ఛక్రం తిప్పినట్టు ప్రచారం జరుగుతోంది. గత నెలలోనే టీఆర్ఎస్లో చేరడానికి నిర్ణయించుకున్న కౌశిక హరి కొన్ని సాంకేతిక కారణాలతో ఆగిపోయారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ జిల్లా అధ్యక్షులు కాసిపేట లింగయ్య చొరవ తీసుకుని టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లవద్దని చెప్పగా, హరి దానికి ఒప్పుకున్నారు. అంతేకాక రామగుండం నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ కూడా హరికి ఇప్పిస్తానని మాట ఇవ్వడంతో అప్పుడు టీఆర్ఎస్లో చేరికకు బ్రేక్ పడింది. కానీ, ఇచ్చిన మాట ప్రకారం బీజేపీ అధిష్టాన వర్గం బల్మూరి వనితకు టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనితో తీవ్ర మనస్థాపానికి గురైన కౌశిక హరి, సమయం కోసం వేచిచూస్తున్న తరుణంలో రామగుండం తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ప్రత్యేక చొరవ తీసుకుని టీఆర్ఎస్ పార్టీలోరి రావాలని కోరడంతో, హరి దానికి అంగీకారం తెలిపారు. దీనితో అధిష్టాన వర్గం పిలుపుమేరకు ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్కు చేరుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇక్కడి తాజా మాజీ ఎమ్మెల్యే దగ్గర ఉండి ఈ వ్యవహారం నడిపించినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కౌశిక హరికి ఏదో ఒక నామినేటెడ్ పదవీ ఇవ్వజూపినట్టు సమాచారం.