టీఆర్‌ఎస్ నేత వల్లభనేని దారుణ హత్య
– బండరాళ్లతో కొట్టి చంపిన దుండగులు
– కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
హైదరాబాద్, నవంబర్16(జనంసాక్షి) : హైదరాబాద్ నగరంలో టీఆర్‌ఎస్ నేత ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. వల్లభనేని శ్రీనివాసరావు అనే తెరాస నాయకుడు సనత్‌నగర్ బస్టాండ్ సవిూపంలో హత్యకు గురై ఉండడాన్ని గురువారం ఉదయం స్థానికులు గమనించారు. బండరాళ్ళతో అతన్ని కొట్టి చంపారు. సమారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అలాగే డాగ్ స్క్వాడ్‌ను రప్పించి నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా టీఆర్‌ఎస్ నాయకుడు వల్లభనేని శ్రీనివాసరావు హత్య కేసులో ముగ్గురు పాల్గొని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలంలో రెండు మద్యం బాటిళ్ళతోపాటు నాలుగు గ్లాసులు ఉండడంతో నలుగురు కలిసి మద్యం సేవించిన అనంతరం మిగతా ముగ్గురు కలిసి శ్రీనివాసరావును హత్య చేసి ఉండవచ్చిన పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రాలోని పాలకొల్లుకు చెందిన శ్రీనివాసరావు గత కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి స్థిరపడ్డాడు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతుండగా ఆపార్టీలోని మరో వర్గం ఈయన్ను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలోనే శ్రీనివాసరావు హత్యకు గురవ్వడంపై ఈ కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.