టీకా అందరికీ.. – కేజ్రీవాల్
దిల్లీ,నవంబరు 21(జనంసాక్షి): కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపిణీలో ప్రముఖులు, సామాన్యులు అనే భేదాలు ఉండరాదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రతి ఒక్కరి జీవితం విలువైనదేనని.. కాకుంటే కరోనా యోధులకు తొలిప్రాధాన్యం ఇవ్వాలని ఆయన ‘సూచించారు. అనంతరం వయోవృద్ధులకు, ఇతర ఆరోగ్య సమస్యలున్నవారికి కొవిడ్-19 టీకాలను అందచేయాలని ఆయన అన్నారు.ఇటీవలి ఓ సమావేశం సందర్భంగా కేజ్రీవాల్ తన అభిప్రాయాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యాలను అనుసరించి టీకా పంపిణీ ప్రణాళికను సిద్ధం చేస్తోందని.. ఈ విధానం రాజకీయ ప్రోద్బలంతో కాకుండా సాంకేతిక కారణాలను అనుసరించి ఉండాలని ఆయన సూచించారు. మొత్తం ప్రపంచం మాదిరిగానే దిల్లీ కూడా కొవిడ్-19 టీకా కోసం వేచి చూస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. అయితే దీనిని అందచేసే విషయంలో వీఐపీలు, సాధారణ ప్రజలు అనే భేదాలేవీ ఉండరాదని ఆయన హితవు పలికారు.ప్రస్తుతం దిల్లీలో సుమారు 43 వేల యాక్టివ్ కొవిడ్ కేసులున్నాయని.. వారిలో 25 వేల మంది ¬ం ఐసోలేషన్‌లో ఉన్నారన్నారు. ఇదిలా ఉండగా దిల్లీలో గురువారం నాటి 7546 కొత్త కరోనా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 5.1 లక్షలకు పైబడగా.. మృతుల సంఖ్య 8041కు చేరినట్టు తెలిసింది. దేశ రాజధానిలో మూడో దఫా కరోనా వ్యాప్తి జరుగుతోందని.. అయితే పరిస్థితి అదుపు తప్పలేదని కేజ్రీవాల్ అన్నారు. పరీక్ష, ట్రేసింగ్, ఐసోలేషన్ తదితర ప్రక్రియలను తమదైన శైలిలో చేపట్టడమే ఇందుకు కారణమని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో మాస్కు ధరించని వారికి రూ.2000 జరిమానా విధిస్తున్నారు.