టీచర్ కు ఆరు కోట్ల ప్రైజ్!
న్యూఢిల్లీ: బోధనా విభాగంలో నోబెల్ అవార్డుగా భావించే వార్కీ ఫౌండేషన్ గ్లోబల్ టీచర్ అవార్డును అమెరికాకు చెందిన ఉపాధ్యాయురాలు న్యాన్సీ అత్వేల్ సొంతం చేసుకున్నారు. ఈ అవార్డు నామినీల్లో గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన కిరన్ బిర్ సేధి చివరివరకు పోటీలో నిలిచారు. అమెరికాలోని ఎడ్గేకాంబ్లోగల ది సెంటర్ ఫర్ టీచింగ్ అండ్ లెర్నింగ్ సంస్థలో ఉపాధ్యాయురాలుగా న్యాన్సీ అత్వేల్ పనిచేస్తున్నారు. ఈ అవార్డు విలువ ఒక మిలియన్ డాలర్లు. అంటే దాదాపు ఆరు కోట్లు పైనే.
టాప్టెన్లో న్యాన్సీ అత్వెల్ తర్వాత చోటుదక్కించున్న కిరన్ బిర్ సేథి మాట్లాడుతూ తనకు దక్కిన ఈ గౌరవం న్యాన్సీతోపాటు పోటీలో నిలిచిన మిగతావారితో కలిసి పంచుకుంటానని చెప్పారు. న్యాన్సీ తర్వాత వరుసగా కిరణ్ బిర్ సేథి, గై ఎటిన్నే, జాక్వే కహురా, పాల్లా నియాంగ్, స్టీపెన్ రిట్జ్, అజిజుల్లా రాయేష్, మదేన్ జిత్ సింగ్, రిచర్డ్ స్పెన్సర్, నోమి వాలేయిన్ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఈ అవార్డును బోధనా రంగంలో అత్యున్నత విలువలు పాటించినవారికి, ఉత్తమ నైపుణ్యాలు ప్రదర్శించినవారికి అందిస్తారు.