టీటీడీపీని తెరాసలో విలీనం చేస్తే మేలు 

– పార్టీని భుజానవేసుకొని నిడిపిద్దామన్నా సహకరించేవారు లేరు
– పార్టీ అంతరించిపోతుందన్న అవమానంకంటే.. మిత్రుడికి సాయంచేస్తే గౌరవంగా ఉంటుంది
– కేసీఆర్‌ కూడా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తే
– టీడీపీ సీనియర్‌ నేత మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు
– మోత్కుపల్లి వ్యాఖ్యలపై మండిపడుతున్న పలువురు తెదేపా నేతలు
– విలీనమనేది మోత్కుపల్లి వ్యక్తిగతం – ఎల్‌. రమణ
హైదరాబాద్‌, జనవరి18(జ‌నంసాక్షి) : తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద గురువారం ఆయన నివాళులర్పించారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ తెలుగుదేశం పార్టీని తెరాసలో విలీనం చేస్తే బాగుంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు వచ్చి నివాళులర్పిస్తే బాగుండేదన్న మోత్కుపల్లి తెలంగాణలో తెదేపా ప్రాభవం కోల్పోతోందని అందరూ అంటున్నారని పేర్కొన్నారు. అలాంటి మాటలు వింటుంటే బాధనిపిస్తోందని, పార్టీని భుజాన వేసుకుని నడుపుదామన్నా.. సహకరించేవారు కరువయ్యారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలు, ఓటర్ల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందని మోత్కుపల్లి పేర్కొన్నారు. తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెదేపా నుంచి వెళ్లిన వారేనని, అక్కడున్న మంత్రులందరూ తెదేపా వారేనని, ఈ పరిస్థితుల్లో తెదేపాను తెరాసలో విలీనం చేయగలిగితే బాగుంటుందనేది తన అభిప్రాయమన్నారు. అది గౌరవంగానూ ఉంటుందన్నారు. పార్టీ అంతరించిపోయిందన్న అవమానం కంటే ఒక మిత్రుడికి సాయం చేయడమే గౌరవంగా ఉంటుందన్నారు. ఒకవేళ విలీనం చేసే ఉద్దేశం లేకపోతే చంద్రబాబే తెలంగాణ ప్రాంతమంతా తిరిగి ఇతర పార్టీలకు దీటుగా నడపాల్సి ఉంటుందని మోత్కుపల్లి నర్సింహులు
వ్యాఖ్యానించారు. మోత్కుపల్లి వ్యాఖ్యలపై టీతెదేపా పార్టీ అధ్యక్షులు ఎల్‌. రమణ స్పందించారు. విలీనమనేది మోత్కుపల్లి వ్యక్తిగత విషయమన్నారు. టీడీపీలో అందరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని అన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై  చంద్రబాబు దృష్టిసారించారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని చోట్లా తెదేపా అబ్యర్థులు పోటీ చేస్తారని, తెదేపాను కాపాడుకొనేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని అన్నారు.
మండిపడుతున్న తెదేపా నేతలు..
మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పలువురు తెదేపా నేతలు మండిపడుతున్నారు. మహబూబ్‌నగర్‌ తెదేపా మాజీ ఎమ్మెల్యే దయాకర్‌ రెడ్డి మాట్లాడుతూ తెదేపాను టీఆర్‌ఎస్‌లో కలపాల్సింన గత్యంతరం పట్టలేదని వ్యాఖ్యానించారు. తెదేపాకు రాష్ట్రంలో కార్యకర్తల బలం ఉందని, కేవలం నాయకులు మాత్రమే పోయారన్నారు. మోత్కుపల్లి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, సత్తా ఉంటే పార్టీని బలోపేతం చేసేలా కృషి చేయాలని సూచించారు. మోత్కుపల్లి మాట్లాడే సమయంల తాను పక్కనుంటే పరిస్థితి వేరేదిలా ఉండేదని వ్యాఖ్యానించారు. అదేవిధంగా మోత్కుపల్లి వ్యాఖ్యలపై ఆయా జిల్లాల్లోని పలువురు తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీని తెరాసాలో
కలపాల్సిన అవసరం ఏవిూలేదని, అందరం ఐక్యంగా పార్టీని బోపేతం చేయాల్సింది పోయి మోత్కుపల్లి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.