టీడీపీ చెప్పుకోవటానికి ఏదీ మిగలదు

– కేంద్రం హావిూలపై త్వరలో స్పష్టమైన ప్రకటన రానుంది
– ఏపీలో కేంద్రమంత్రులు పర్యటించి ఆ విషయం చెబుతారు
– మోదీ పట్ల ప్రజలకు ఎంతో విశ్వాసం ఉంది
– బీజేపీ నేత, సినీ నటుడు కృష్ణంరాజు
హైదరాబాద్‌, జులై23(జ‌నంసాక్షి) : కేంద్రం ఏపీకి ఇచ్చిన హావిూలన్నీ నెరవేర్చేందుకు సిద్ధంగా ఉందని, త్వరలో ఆమేరకు ప్రకటన రాబోతుందని, ఇక టీడీపికి చెప్పుకోవటానికి ఏ అంశం మిగలదని బీజేపీ నేత కృష్ణంరాజు అన్నారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో కృష్ణంరాజు మాట్లాడుతూ.. మోదీ పట్ల ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో అవిశ్వాస తీర్మానంతో అర్థమైందని అన్నారు. అవిశ్వాసం కోసం 18పార్టీల మద్దతు కూడట్టామని అన్నారని, అయితే ఏపీకి అన్యాయం జరిగిందని ఏ ఒక్కపార్టీతో కూడా చెప్పించలేకపో యారన్నారు. వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నాయకులపై ఉందని కృష్ణంరాజు పేర్కొన్నారు.
రోలవరం, దుగ్గిరాజపట్నం పోర్టు, కడప ఉక్కు కర్మాగారం, విశాఖపట్నం రైల్వే జోన్‌, ట్రైబల్‌  యూనివర్సిటీలపై త్వరలోనే కేంద్రం స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించబోతోందని తెలిపారు. రాష్ట్రంలో కేంద్రమంత్రులు పర్యటించి వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తారన్నారు. తాత్కాలిక భవనాల్లో జాతీయ విద్యా సంస్థలను నిర్వహిస్తున్నారు. త్వరలో వాటికి శాశ్వత భవనాలు నిర్మించేందుకు కేంద్రం అన్ని విధాలుగా కృషి చేస్తుందని కృష్ణంరాజు తెలిపారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నిధులు కేటాయించిందన్నారు. మరిన్ని నిధులు కావాల్సి వస్తే వాటికి వనరులను కేంద్రం చూపిస్తుందని చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పుకోటానికి ఇకపై టీడీపీకి ఏఅంశం మిగలదని ఆయన చెప్పుకొచ్చారు. మోదీపై వ్యక్తిగత విమర్శలు సరికాదన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిణాలపై నివేదికను సిద్ధం చేసి ఢిల్లీ పెద్దలకు పంపుతున్నామన్నారు. త్వరలోనే ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నట్లు కృష్ణంరాజు తెలిపారు.