టీడీపీ హయాంలో వేలకోట్ల అవినీతి జరిగింది

– నీటిపారుదల రంగంలో జరిగిన అన్నిపనులపై సీబీఐ దర్యాప్తు చేయాలి
– ఆప్కోలో జరిగిన అవినీతిపై ప్రత్యేక విచారణ జరిపించాలి
– వైసీపీ నేత, మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి
కడప, జూన్‌7(జ‌నంసాక్షి) : టీడీపీ హయాంలో ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టు పనుల్లో వేలకోట్ల అవినీతి జరిగిందని, ఐదేళ్లలో నీటిపారుదల రంగంలో జరిగిన ప్రాజెక్టులపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని వైసీపీ నేత, మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. చంద్రబాబు పాలనలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు
నిర్మాణంలో అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తన వియ్యంకుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు అప్పనంగా పనులు అప్పగించారని విమర్శించారు. రాష్ట్రంలో పనులకు సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కమిషన్‌ తీసుకోవడం సిగ్గుచేటని డీఎల్‌ అన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో జరిగిన అన్ని పనులపై సీబీఐ దర్యాప్తు చేయాలని అన్నారు. ఎన్నికల తర్వాత వైఎస్‌ జగన్‌ను కలిసి ధన్యవాదాలు చెప్పానని, వైఎస్‌ జగన్‌పై గతంలో నేను ఎన్నికల్లో పోటీ చేసినా నాపై ఆయన చూపిన ప్రేమ ఆప్యాయతలు మర్చిపోలేనన్నారు. రాష్ట్ర ఖజానాను దోచుకున్న విధానంపై జగన్‌ దృష్టికి తీసుకెళ్ళానని డీఎల్‌ అన్నారు. కుప్పంలో హంద్రీనీవా పనుల్లో 75కోట్ల పనులను 400కోట్లకు పెంచి అవినీతికి పాల్పడ్డారని అన్నారు. అన్ని ప్రాజెక్టుల పనుల్లో వేలకోట్ల అవినీతి జరిగిందని, దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి దాదాపు పూర్తి చూసిన పనులకు చంద్రబాబు తిరిగి ఓపెన్‌ చేశారని డీఎల్‌ అన్నారు. ఆప్కో వల్ల చేనేతలకు కనీస న్యాయం కూడా జరగలేదని, ఆప్కోలో జరిగిన అవినీతిపై ప్రత్యేక విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నానని డీఎల్‌ రవీంద్రా రెడ్డి పేర్కొన్నారు.