టీయారెస్‌ పాంచ్‌ పటాకా

02

కాంగ్రెస్‌ ఒకటి

మండలిలో తెదెపా ఖాతా నిల్‌

హైదరాబాద్‌,జూన్‌1(జనంసాక్షి): టిఆర్‌ఎస్‌ వ్యూహం ఫలించింది. కెసిఆర్‌ నేతృత్వంలో ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహరచన చేసిన టీయారెస్‌ పార్టీ నుంచి ఐదు స్థానాల్లో అభ్యర్థులు మండలికి ఎన్నికయ్యారు. సోమవారం ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ఐదు, కాంగ్రెస్‌ ఒక స్థానాన్ని గెల్చుకుంది. తడబడుతూ నిలబడ్డ టిడిపి చావుదెబ్బ తినక తప్పలేదు. వేంనరెందర్‌రెడ్డి ఓటమిటో టీడీపీకి మండలిలో ఖాతా నిల్‌ అయ్యింది. తెలంగాణ అవతరణ దినోత్సవానికి ఒకరోజు మందు జరిగిన ఈ ఎన్నికతో టిఆర్‌ఎస్‌కు బొనాంజా దక్కిందని చెప్పవచ్చు. ఎమ్మెల్యే కోటాలో శాసనమండలి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఐదు స్థానాలు కైవసం చేసుకుంది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహర, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, బి. వెంకటేశ్వర్లు, యాదవరెడ్డి, నేతి విద్యాసాగర్‌,  విజయం సాధించారు. మరో స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆకుల లలిత విజయం సాధించారు. ఇక బిజెపి మద్దతుతో టిడిపి నుంచి పోటీ చేసిన వేం నరేందర్‌ రెడ్డి ఓడిపోయారు. తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీచేసిన ఐదుగురు అభ్యర్థులూ విజయం సాధించారు. శాసన మండలిలోని ఆరు ఖాళీ స్థానాలకు సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో.. టీఆర్‌ఎస్‌ ఐదు స్థానాలను, కాంగ్రెస్‌ పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. టీడీపీ అభ్యర్థి వేం నరేందర్‌ రెడ్డి ఓడిపోయారు. టీడీపీ – బీజేపీ ఎమ్మెల్యేల ఓట్లలో ఐదు ‘నోటా’కు పడ్డాయి. అయితే ఇవి బీజేపీ ఎమ్మెల్యేలు వేసినవా, టీడీపీ వాళ్లు వేసినవా అనేది తెలియడంలేదు. కాంగ్రెస్‌ నుంచి మొత్తం 18 ఓట్లు ఆకుల లలితకే పడ్డాయి. వాస్తవానికి టీఆర్‌ఎస్‌ పార్టీకి నలుగురు అభ్యర్థులను మాత్రమే గెలిపించుకునేందుకు తగినంత బలం ఉంది. కానీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు.. ఎలాగైనా ఐదుగురినీ గెలిపించాల్సిందేనని, లేకపోతే అసెంబ్లీని సైతం రద్దుచేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్తానని కూడా పార్టీ అంతర్గత సమావేశాల్లో హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈలోపు నామినేటెడ్‌ ఎమ్మెల్యే ఓటును కొనుగోలు చేసేందుకు వెళ్లిన టీ-టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి రెడ్‌ హ్యాండెడ్గా ఏసీబీకి దొరికిపోవడం లాంటి సంచలన విశేషాలు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగానే జరిగాయి. తెలంగాణ అసెంబ్లీలో ఒక నామినేటెడ్‌ ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 120 మంది సభ్యులున్నారు. వీరిలో ఇద్దరు వామపక్ష సభ్యులు ఓటింగుకు దూరంగా ఉన్నారు. మొత్తం 118 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయితే కెసిఆర్‌ వ్యూహం మేరకు టిడిపిని దెబ్బకొట్టలాని పన్నిన ప్రణాళిక ఫలించింది. అనుకున్నట్టే తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఐదుగురు అభ్యర్ధులూ శానస మండలి సభ్యులుగా గెలుపొందారు.  ఎన్నికలో ఐదు చెల్లనిఓట్లు పడ్డాయి. ఇవిగాక మరొకటి నోటా ఓటు. ఈ ఆరు ఓట్లూ తెలుగుదేశం, బిజెపి కూటమి ఓట్లేనని భావిస్తున్నారు. ఎంతో ఉత్కంఠగా మారిన ఈ ఎన్నికలో ఆరు ఓట్లు చెల్లకపోవడంతో తెలుగుదేశం పార్టీకి రావలసిన ఓట్లు కూడా రాలేదని అర్థమవుతున్నది.  కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆకుల లలిత ను కౌన్సిల్‌ సభ్యురాలిగా పోటీ చేయడానికి కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయించడం సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు దానం నాగేందర్‌కు ఆగ్రహం తెప్పించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నుంచి వేం నరేంద్ర పోటీ చే శారు. ఒక సీటును సంపాదించుకోగలమని తెలుగుదేశం పార్టీ ఆశించింది. తమ పార్టీ సభ్యులకు విప్‌ను జారీ చేసిన తెలుగుదేశం పార్టీ రోజురోజుకూ బలాన్ని కోల్పోతూవచ్చింది. క్రాస్‌ ఓటింగు తమకు కలిసివస్తుందని తెలుగుదేశం ఆశించింది. కాని చివరికి ఆ పార్టీ ప్రముఖుడు రేవంత్‌ రెడ్డి ఎమ్మెల్సీ ఓటు కొనడంకోసం రూ. 50 లక్షలు ఎరవేసిన కేసులో ఎసిబికి అడ్డంగా దొరికిపోవడంతో ఆ పార్టీ ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది. ఒకరోజు ముందే మాధవరం టిఆర్‌ఎస్‌ గూటికి చేరారు. ఇకపోతే ఏడుగురు ఎంఐఎం, ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు కూడా టిఆర్‌ఎస్‌కు మద్దతు పలకడంతో కెసిఆర్‌ విజయం సాధించారు. ఈ ఎన్నికలపై ముందు నుంచి ధీమాగా ఉన్న కెసిఆర్‌కు ఇది తెలంగాన అవతరణ దినోత్సవ కానుకగా చెప్పుకోవచ్చు.