టీ మీడియా స్వేచ్ఛపై ఆంధ్రా సర్కారు దాడి
– గవర్నర్‌కు పిర్యాదు చేసిన జర్నలిస్టులు
హైదరాబాద్,జూన్23(జనంసాక్షి): విూడియా స్వేచ్ఛపై ఏపీ సర్కారు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఐజేయూ సెక్రటరీ దేవులపల్లి అమర్ అన్నారు. జర్నలిస్ట్ సంఘాల నేతలు మంగళవారం గవర్నర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. రాజ్‌భవన్‌లో వివిధ పత్రికలు, ఛానల్ల ఎడిటర్లు, విూడియా సంఘాల నేతలతో కలిసి గవర్నర్‌ను నరసింహన్‌ను కలిశారు. ఏపీ సర్కారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన విూడియా సంస్థకు నోటీసు ఇవ్వడంపై ఫిర్యాదు చేశారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక నేరానికి సంబంధించి దర్యాప్తు జరుగుతోందని, అందుకు సంబంధించిన అంశాలను ప్రసారం చేస్తే విూడియా సంస్థ నోరు నొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. విూడియాను తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. విూడియాకు అడ్డుపడే ప్రయత్నం ఏపీ పోలీసులు చేస్తున్నారని దుయ్యబట్టారు. టీ న్యూస్ కు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని విూడియా సంస్థలన్నీ ఏపీ సర్కారు చర్యను తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు.విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, కానీ ఇవాళ ఆ చట్టాలను అతిక్రమించి ప్రవర్తిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక విూడియా సంస్థను వెనకేసుకొస్తూ ఎన్నోసార్లు పత్రికా స్వేచ్ఛ అంటు గీపెట్టారని పేర్కొన్నారు. ఒక విూడియా సంస్థకు వచ్చిన సోర్స్ గురించి చెప్పమని బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు. ఒక విూడియా ఛానల్‌కు నోటీసులు ఇవ్వడమంటే అది చట్టవిరుద్దమే అవుతుందని ప్రెస్ అకాడవిూ ఛైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఏపీ సర్కారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన విూడియా సంస్థకు నోటీసు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. టీ న్యూస్‌కు నోటీసు ఇవ్వడం పత్రికా స్వేచ్ఛపై దాడిగా పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు నాయుడు తనకు చుట్టుకున్న ఉచ్చును హైదరాబాద్‌కు చుడుతున్నాడని అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. చట్ట విరుద్దంగా టీ న్యూస్‌కు నోటీసు ఇచ్చిన ఏపీ సర్కారుపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరామని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో సెక్షన్-8 అమలును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని,. హైదరాబాద్‌లో గవర్నర్‌గిరి చెల్లదని తేల్చి చెప్పారు. హైదరాబాద్‌లో సెక్షన్-8 వర్తింపజేయాలని కేంద్రం తెస్తున్న కుట్రలను చేదిద్దామని పిలుపునిచ్చారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ పోలీసులను ఇన్‌వాల్వ్ చేస్తున్నాడని నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి అన్నారు. పోలీసులను ఉపయోగించుకుని టీ న్యూస్‌కు నోటీసు ఇచ్చారని పేర్కొన్నారు. విూడియాపై దాడి చేసి చంద్రబాబు తప్పు చేశాడని, చంద్రబాబు కొరివితో తలగోక్కుంటున్నారని హెచ్చరించారు. టీ న్యూస్‌కు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చినపుడు ఒకే పోలీసు అధికారి వచ్చి నోటీసులు సర్వ్ చేశారని, ఆవేశాలకు పోయి ఏదైనా జరిగితే దానికి బాధ్యులెవరు? అని నిలదీశారు. ఏదైనా జరగరానిది జరిగితే రెండు రాష్ట్రాల ప్రజలే కదా? నష్టపోయేది అని అన్నారు. కావాలనే చంద్రబాబు రెండు రాష్ట్రల ప్రజల మద్య చిచ్చుపెట్టాలని చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ఇంకా కొన్ని పత్రికలకు నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తుందన్నారు. ఇలాంటి చర్యలను గవర్నర్ నిలువరించాలని లేకుంటే తీవ్ర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. టీ న్యూస్‌కు జారీ చేసిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సర్కారు ఏ రోజు కూడా నోటీసులు జారీ చేయలేదన్నారు. హైదరాబాద్ నగరం చాలా ప్రశాంతంగా ఉందని టీయూడబ్ల్యూజే జనరల్ సెక్రటరీ క్రాంతి అన్నారు. రాష్ట్రం వచ్చాక ఇప్పటి వరకు బోనాలు, మొహర్రంతో పాటు అన్ని పండుగలు ప్రశాంతంగా జరిగాయని వెల్లడించారు. ఆఖరుకు హైదరాబాద్‌లో టిడిపి మహానాడు కూడా ప్రశాంతంగా జరుపుకున్నారని అన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ప్రశాంత వాతావరణంలో ఉందని, సెక్షన్-8
తెరపైకి తేవడంలో ఉద్దేశ్యాలు వేరేగా ఉన్నట్లు స్పష్టమవుతుందని టీయూడబ్ల్యూజే జనరల్ సెక్రటరీ క్రాంతికిరణ్ తేల్చి చెప్పారు. హైదరాబాద్‌లో సెక్షన్-8 అమలు చేయడమంటే తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని పల్లె రవి అన్నారు. ఇదే విషయాన్ని గవర్నర్‌కు చెప్పామన్నారు. సెక్షన్-8ను అమలు చేయాలని చూస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యమం కన్నా అత్యంత శక్తివంతమైన ఉద్యమాన్ని చేపడతామన్నారు. ఆంధ్రుల కుట్రలను తిప్పి కొడతామని రవి హెచ్చరించారు.