టెండర్లను రద్దు చేయండి
నిజామాబాద్, జూలై 18 : మున్సిపల్ కార్పోరేషన్‌లో ఔట్ సోర్సింగ్ కింద పబ్లిక్ హెల్త్ విభాగంలో పిలిచిన టెండర్లను రద్దు చేయాలని కోరుతూ ఎఐటియుసి,ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో బుధవారం నాడు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎఐటియుసి నాయకుడు ఓమయ్య , ఐఎఫ్‌టియు వనమాలకృష్ణ మాట్లాడుతూ, మున్సిపల్ కార్పోరేషన్‌లో సిఐజిలుగా, సోసైటీలుగా ఏర్పడి కార్మికులకు ఔట్ సోర్సింగ్ కింద పబ్లిక్ హెల్త్ విభాగంలో కార్మికులు గత పదిహేను సంవత్సరాలుగా పని చేస్తున్నారని వారు పేర్కొన్నారు. కార్మికులతో పని చేయించుకుంటున్నందుకు మూడు నెలలుగా అగ్రిమెంట్‌ను రాయించుకుంటూ అవసరం లేని వారిని తొలగించడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. టెండర్ విధానాన్ని రద్దు చేసి కార్మికులకే ఈ టెండర్‌ను ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పబ్లిక్ హెల్త్ విభాగంలో డ్రైవర్లు, క్లీనర్లు, స్వీపర్లుగా పని చేస్తున్న కార్మికులకు కాంట్రాక్టర్లు డబ్బులు చెల్లించకుండా వారి శ్రమను దోపిడి చేస్తున్నారని వారు ఆరోపించారు. పిలిచిన టెండర్లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ యూనియన్ కార్మికులు పాల్గొన్నారు.