టెన్త్‌ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు


కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు
కరీంనగర్‌,మార్చి12(జ‌నంసాక్షి): పదోతరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టామని జిల్లా విద్యాధికారి చెప్పారు. ఇందుకోసం ముందస్తు ప్రణాళికలు రూపొందించామన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలని కోరారు. పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జరుగకుండా ప్రత్యేక బృందాలు నియమించామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాల్లో ఫర్నిచర్‌, తాగునీటి వసతి, చీకటి లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.  విద్యార్థినులు ఇబ్బందులు పడకుండా పత్యేకించి మూత్రశాలలు ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాలు, అవసరమైన సెంటర్లలో సిట్టింగ్‌ స్కాడ్‌లు ఉంటారు. జిల్లా విద్యాధికారితో పాటు, తహసీల్దార్లు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేస్తారు. ఇన్విజిలేటర్ల నుంచి చీఫ్‌ సూపరింటెండెంట్‌ వరకు ఎవరూ సెల్‌ఫోన్‌లు వాడవద్దనే నిబంధనలున్నాయి. సంబంధిత సబ్జెక్టు పరీక్ష రోజు ఆ విషయాన్ని బోధించే ఉపాధ్యాయుడు పరీక్ష విధులు నిర్వహించకుండా చర్యలు తీసుకున్నాం. మాస్‌కాపీయింగ్‌ లాంటివి జరిగేతే చీఫ్‌ సూపరింటెండెంట్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.  పరీక్షలు జరిగిన తీరుపై రోజూ సవిూక్షించి తగిన చర్యలు చేపడుతామన్నారు. ఇదిలావుంటే పరీక్షలు జరిగేటప్పుడు మారుమూల గ్రామాల్లోని కేంద్రాలకు బస్సులు నడపాలని కలెక్టర్‌ సూచించారు. ఆర్టీసీ అధికారులు తాంసి, నార్నూర్‌ మండలాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది సైతం అందుబాటులో ఉంటారు. పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు చర్యలు తీసుకున్నట్లు  తెలిపారు. పరీక్ష రోజూ ఉదయం 9.30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతి ఇస్తారు. విద్యార్థులకు 15 నిమిషాలు ప్రశ్న పత్రాన్ని చదివే సమయం ఉండడంతో వారు క్షుణ్ణంగా చదివి, ప్రశ్నను ఆర్థం చేసుకుని ఎలాంటి ఆందోళన చెందకుండా జవాబులు రాయాలన్నారు.   జిల్లాలో ఈ సారి మెరుగైన ఫలితాలు సాధించేందుకు  సబ్జెక్టు టీచర్స్‌ లేని పాఠశాలల్లో ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో పాఠాలు చెప్పించడమే కాకుండా విద్యా వలంటీర్లను నియమించామన్నారు.  వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు, పేరెంట్స్‌ సమావేశాలు నిర్వహించి విద్యార్థులు క్రమంగా తరగతులకు హాజరయ్యేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.