టైప్‌రైటర్‌ను తన్నిన పోలీసు

uz5cgayx
లక్నో, సెప్టంబర్ 20: ఆటవిక రాజ్యంగా పేరున్న ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు మరోసారి తమ రాక్షసత్వాన్ని నిరూపించుకున్నారు. లక్నో హజ్రత్‌గంజ్ పోస్టాఫీసు బయట టైప్‌రైటర్‌ ఆధారంగా పొట్టపోసుకునే 65 ఏళ్ల కిషన్ కుమార్ అనే వృద్ధుడిపై ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్ తన ప్రతాపం చూపించాడు. ఖాళీ చేయమన్నా చేయడం లేదని ముసలాయనకు జీవనాధారమైన టైప్ రైటర్‌ను కాలితో తన్ని పగలకొట్టాడు. 30 ఏళ్లుగా రోజుకు పది గంటలు పనిచేస్తూ 50 రూపాయలు సంపాదించుకునే తనపై ఎస్‌ఐ దౌర్జన్యం చేయడంపై వృద్ధుడు లబోదిబోమన్నాడు. ఎస్‌ఐ దుర్మార్గాన్ని ఫొటోలు తీసిన స్థానికులు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఎస్ఐ దౌర్జన్యంపై నెటిజన్లు మండిపడ్డారు. విషయం తెలుసుకున్న సిఎం అఖిలేష్ యాదవ్ దౌర్జన్యానికి పాల్పడ్డ ఎస్ఐని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్, డిఎస్పీ ఇద్దరూ ముసలాయన కిషన్ కుమార్‌ను కలిసి సారీ చెప్పారు. కొత్త టైప్‌రైటర్ కొనిచ్చారు.