ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ
ట్రంప్‌కు దెబ్బ మీద దెబ్బ. ఓ వైపు అధ్యక్షుడికి వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న నిరసనలు. ఏకంగా అభిశంసన ప్రక్రియ ద్వారా ఆయన్ను తొలగించాలంటూ డిమాండ్లు. మరోవైపు కోర్టుల్లో ట్రంప్ సర్కారుకు వరుస ఎదురు దెబ్బలు. ఏడు ముస్లిం దేశాల నుంచి ఎవరినీ అమెరికాలోకి అనుమతించరాదన్న ఉత్తర్వులపై స్టే ఎత్తి వేయాలన్న వినతిని తోసిపుచ్చిన అప్పీల్స్ కోర్టు.
అధికార పగ్గాలు చేపట్టి ఇంకా నెల కూడా కాలేదు! అప్పుడే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారశైలితో ఆ దేశ ప్రజలే కాదు.. ప్రపంచంలోని పలు దేశాలూ గగ్గోలు పెట్టడం మొదలైంది. అధ్యక్ష పదవిలో కూర్చున్న రోజు నుంచీ నిత్యం ఏదో ఒక సంచలనంతో పతాక శీర్షికలకెక్కుతున్న ఘనత ట్రంప్‌ది!! అందుకే ఆయన అధికారంలోకి వచ్చిన మూడువారాల్లోపే.. ఆయన్ను అభిశంసన ద్వారా తొలగించాలనే వారి సంఖ్య పెరిగింది. అమెరికాలో చేపట్టిన ఒక పోల్‌లో.. 40 శాతం రిజిస్టర్డ్ ఓటర్లు ట్రంప్‌ను ఇంపీచ్ చేయడానికి తమ మద్దతు తెలపడం గమనార్హం. ఆ మాటకొస్తే ట్రంప్ ఇంపీచ్‌మెంట్ గురించిన ఆలోచనలు ఇప్పటివి కావు.
ట్రంప్ గెలిచిన నవంబరు 8 నుంచి.. గూగుల్‌లో ‘అమెరికా అధ్యక్షుడి ఇంపీచ్‌మెంట్’ గురించి అన్వేషించినవారి సంఖ్య 5000 శాతం పెరిగిపోయింది. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలకు వ్యతిరేకంగా అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నిరసనలు మిన్నంటాయి. న్యూయార్క్, వాషింగ్టన్, ఫ్లోరిడాలో ఆందోళనకారులు మరోసారి కదం తొక్కారు. ట్రంప్ సొంత నగరమైన న్యూయార్క్‌లో 3 వేల మంది వరకు ప్రదర్శన చేపట్టారు. వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్ నుంచి క్యాపిటల్ హిల్ వరకు వందల మంది ర్యాలీ చేపట్టారు. బ్రిటన్ రాజధాని లండన్‌లో 10వేల మందికిపైగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోనూ ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి.
ట్రంప్ టోపీ ధరించిన విద్యార్థిపై దాడి!
అమెరికాలో ‘ట్రంప్’ టోపీ ధరించిన ఆరో గ్రేడ్ స్కూలు విద్యార్థిపై స్కూలు బస్సులో సహచర విద్యార్థులు దాడికి దిగారు. ఈ ఘటన అమెరికాలోని మిస్సోరిలో శనివారం చోటు చేసుకుంది. పార్క్‌వే స్కూల్ డ్రిసి్ట్రక్ట్‌కు చెందిన విద్యార్థులు బస్సుల్లో వెళ్తుండగా.. గవిన్ అనే విద్యార్థి ట్రంప్ నినాదం ‘మేక్ అమెరికా గ్రేట్ అగేన్’ అని రాసి ఉన్న టోపీని ధరించి ఎక్కాడు. దానిపై ట్రంప్ సంతకం కూడా ఉంది. దీంతో గవిన్‌తో కొందరు విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. అది పెద్దదై ఘర్షణగా మారింది. వారంతా గవిన్‌పై పిడిగుద్దులు కురిపించారు.