ట్రంప్ మొట్టమొదటి ఫారెన్ టూర్
అమెరికా అధ్యక్షుడిగా జనవరిలో పదవీ బాధ్యతలు స్వీకరించిన డోనాల్డ్ ట్రంప్.. తన మొట్టమొదటి ఫారెన్ టూర్ ఎక్కడికి వెళతాడన్నది ఆసక్తి రేపింది. రెండునెలల ఉహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. డోనాల్డ్ ట్రంప్ తొలి విదేశీ పర్యటన ఖరారైంది.
అమెరికా అధ్యక్ష హోదాలో ట్రంప్.. తొలి విదేశీ పర్యటనగా బెల్జియంకు వెళ్లనున్నారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్-నాటో దేశాల సదస్సు కు హాజరవడానికి డోనాల్డ్ ట్రంప్ మే 25న బెల్జియంలోని బ్రస్సెల్స్ కు వెళ్లనున్నట్లు వైట్‌హౌస్ వెల్లడించింది.
నార్త్ అమెరికా, యూరోప్ కు చెందిన 28 దేశాల సమూహమే నాటో. ఇందులో అమెరికా, కెనడా తప్పిస్తే మిగతావన్నీ యూరోప్ దేశాలు. బెల్జియం, డెన్మార్క్, ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్, జర్మనీ లాంటి దేశాలు నాటోలో సభ్యులుగా ఉన్నాయి. అయితే అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో నాటోపై ట్రంప్ వ్యతిరేకతను వ్యక్తం చేశాడు. నాటో కూటమిని కాలం చెల్లిన మిలిటరీ సంకీర్ణమని, ఇది అమెరికాకు అనవసరపు ఖర్చుతో కూడిన వ్యవహారమని అప్పట్లో ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తొలి ఫారెన్ టూర్ గా నాటో సమావేశాలకు వెళ్తుండడంతో ఈ పర్యటనపై ఆసక్తి నెలకొంది.
నాటో సదస్సు తర్వాత ట్రంప్.. జీ-20 సదస్సు కోసం జర్మనీకి కూడా వెళ్లనున్నట్లు వైట్‌హౌజ్ తెలిపింది. ఇటీవలి జర్మనీ ఛాన్సలర్ పర్యటన నేపథ్యంలో ఇది ఖరారైంది. జీ-20 సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరుకానున్నారు. ఇప్పటికే మోదీని శ్వేతసౌధానికి ట్రంప్ ఆహ్వానించగా, ట్రంప్‌ను భారత్ టూర్‌కు మోదీ ఆహ్వానించారు. అయితే జీ-20 సదస్సులో ట్రంప్-మోదీ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది.
నాటో దేశాల అధిపతులను కలిసేందుకు, నాటోతో బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు, కూటమికి సంబంధించి కీలక అంశాలు, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం గురించి చర్చించడానికి ట్రంప్ ఎదురుచూస్తున్నారని వైట్ హౌజ్ పేర్కొంది.