ట్రంప్ విమానం క్యాన్సిల్..!!
అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమానం ఖరీదు ఎక్కువగా ఉందని ఆర్డర్ క్యాన్సిల్ చేయించారు. అమెరికా భవిష్యత్ అధ్యక్షుల కోసం బోయింగ్ సంస్థ అత్యాధునిక సదుపాయాలతో నీలం, తెలుపు రంగుల్లో సరికొత్త 747 ఎయిర్‌ఫోర్స్ వన్ విమానాన్ని తయారుచేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.747-8 జంబో జెట్లను అత్యాధునిక సదుపాయాలతో మూడు బిలియన్ డాలర్ల ఖర్చుతో ఎయిర్‌ఫోర్స్ వన్‌గా తీర్చిదిద్దనున్నట్లు తెలుస్తోంది. ఈ విమానం 2024 నాటికి పూర్తవ్వాలన్నది ప్రతిపాదన. అయితే దీన్ని ఖర్చు ఎక్కువగా ఉందన్న కారణంతో డొనాల్డ్ ట్రంప్ నిన్న తోసిపుచ్చారు.ఇప్పుడు వాడుకలో ఉన్న 747-200 డబుల్‌డెక్కర్ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం 1990లో అమెరికా 40వ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ఆర్డర్ చేయించారు. అది ఇప్పుడు పాతపడిపోయింది. ఈ ఏడాది మొదట్లో కొత్త విమానం తయారుచేయడానికి ఎయిర్‌ఫోర్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. తొలుత దీని ధర 25.7 మిలియన్ డాలర్లుగా భావించగా ఇప్పుడది 4 బిలియన్ డాలర్లకు పెరిగిపోవడంతో ట్రంప్ ఆ ఆర్డర్‌ను క్యాన్సిల్ చేయించారు. నాలుగు బిలియన్ డాలర్లంటే చాలా ఎక్కువని, బోయింగ్‌సంస్థ లాభాలు పొందాలని తాము భావిస్తున్నా, మరీ ఇంత ఎక్కువగా లాభపడాలని అనుకోవడం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.