ట్రంప్ సతీమణికి నో అన్న డిజైనర్

3742afdc00000578-3741623-since_donald_trump_joined_the_presidential_race_in_the_us_his_wi-m-123_1471278528379అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియాకు మరో షాక్ తగిలింది. మెలానియా ట్రంప్‌కు దుస్తులు డిజైన్ చేసేది లేదని సెలెబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ టామ్ ఫోర్డ్ తేల్చి చెప్పాడు. అమెరికా తొలి మహిళగా చెప్పుకునేందుకు ఆమె సరిపోరని, కాబట్టి ఆమెకు దుస్తులు డిజైన్ చేసేది లేదని కుండ బద్దలు కొట్టాడు. ఇటీవల మరో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సోఫీ థియల్లెట్ కూడా తాను మెలానియాకు దుస్తులు డిజైన్ చేసేది లేదంటూ షాకిచ్చింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ జాతి వివక్ష, సెక్సిజం, జెనోఫోబియా కారణంగా తానీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ‘‘ఆమె నా ఊహలకు తగ్గట్టుగా లేదు. కొన్నేళ్ల క్రితం తనకు దుస్తులు డిజైన్ చేయమని నన్ను కోరారు. అయితే అందుకు నేను నిరాకరించా’’ అని ఫోర్డ్ తెలిపాడు. ఎన్నికల్లో హిల్లరీకి ఓటేసిన ఆయన ఒకవేళ హిల్లరీ గెలిచినా, మెలానియాకు మాత్రం దుస్తులు డిజైన్ చేసేవాడిని కాదని తేల్చి చెప్పాడు. ప్రస్తుత అమెరికా మొదటి మహిళ మిచెల్లీ ఒబామాకు పలు సందర్భాల్లో దుస్తులు డిజైన్ చేసిన ఫ్రెంచ్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ థియల్లెట్ తాను మెలానియాకు దుస్తులు డిజైన్ చేసేది లేదని, ఆమెకు డిజైన్ చేసేందుకు ఎవరూ ముందుకు రావద్దని కోరతూ నవంబరులో ఏకంగా ఓ బహిరంగ లేఖనే విడుదల చేయడం విశేషం.