ట్రాక్టర్‌ర్యాలీకి ట్రయల్ రన్
– శిక్షణ తీసుకుంటున్న 200 మంది మహిళలు
చండీగఢ్,జనవరి 6(జనంసాక్షి): ఇంట్లో భర్త, పిల్లలకు వండి పెట్టడం.. కుటుంబ పోషణ కోసం పొలం పనుల్లో పాల్గొనడం.. ఇదీ ఆ గ్రామాల మహిళల నిత్య జీవన విధానం. అదే మహిళలు ఇప్పుడు ఆందోళన బాట పట్టారు. వ్యవసాయచట్టాల కోసం ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. ట్రాక్టర్ నడిపి తమ నిరసన తెలియజేసేందుకు రెడీ అంటున్నారు. అందుకోసం ఏనాడూ స్టీరింగ్ ఎరుగని వారంతా శిక్షణ తీసుకుని ట్రాక్టర్ పరేడ్‌లో పాల్గొనేందుకు సై అంటున్నారు.గత కొన్ని రోజులుగా దిల్లీ సరిహద్దులో వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రంతో చర్చలు విఫలమైతే ఈ నెల 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దిల్లీకి ట్రాక్టర్ పరేడ్ నిర్వహించ తలపెట్టారు రైతులు. ఈ నేపథ్యంలో హరియాణాలోని జింద్ జిల్లాకు చెందిన సఫా ఖేరి, ఖత్కర్, పల్లవన్ గ్రామాల మహిళలు పరేడ్‌కు సిద్ధమవుతున్నారు. ఇందులో పాల్గొనేందుకు సుమారు 200 మంది రైతులు ట్రాక్టర్ నడపడంలో శిక్షణ పొందుతున్నారు. జింద్-పటియాలా జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద ఈ శిక్షణ కొనసాగుతోంది. ఏ రోజూ ట్రాక్టర్ నడిపిన అనుభవం లేనప్పటికీ పరేడ్‌లో పాల్గొనేందుకు మహిళలు సిద్ధమవుతున్నారని కిసాన్ ఏక్తా మహిళా మంచ్ అధ్యక్షురాలు షియోకాంత్ వెల్లడించారు. జనవరి 26న ఎవరి సాయం లేకుండా వాళ్లు ట్రాక్టర్ నడపాలన్న లక్ష్యంగా ఈ శిక్షణ సాగుతోందని తెలిపారు. పలువురు గ్రామస్తులు వీరి శిక్షణలో సాయపడడమే కాక.. ట్రాక్టర్లను కూడా సమకూరుస్తున్నారని చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల కోసం తీసుకొచ్చినవి కాదని శిక్షణలో పాల్గొన్న ఓ మహిళ ఆరోపించారు.