ట్రాఫిక్ నియంత్రణలో మంత్రులు
– బుల్లెట్ వాహనంపై హరీశ్, ఈటెల పర్యావేక్షణ
హైదరాబాద్/కరీంనగర్ 19 జూలై (జనంసాక్షి) :
గోదావరి పుష్కరాల నేపథ్యంలో వివిధ జిల్లాల్లో తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడుతోంది. దీంతో ప్రత్యేక బాధ్యతల్లో ఉన్న మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు రహదారులపై నిలిచిపోయిన వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిచేందుకు ట్రాఫిక్ పోలీసుల్లా విధులు నిర్వర్తించారు. శనివారం ధర్మపురికి వెళ్లేందుకు కరీంనగర్ నుంచి మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్‌రావులు బయలుదేరారు. ధర్మారం మండలం ఖమ్మర్‌ఖాన్‌పేట వరకు వెళ్లే సరికి కాన్వాయ్ ముందుకు వెళ్లలేనంతగా వాహనాలు నిలిచిపోయాయి. పరిస్థితిని గమనించిన మంత్రులు రెండు బుల్లెట్ వాహనాలను తెప్పించారు. వాటిపై ప్రయాణం చేస్తూ ఖమ్మర్‌ఖాన్‌పేట వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరణ మొదలుపెట్టి ముందుకు సాగారు. వెల్గటూర్‌మండలం రాజారాం పల్లి వద్ద భారీగా వాహనాలు స్తంభించిపోవడంతో ఆరగంటపాటు రోడ్డుపై నిలబడి వాహనాలను క్రమపద్ధతిలో పంపించారు. వెల్గటూర్ పోలీసులను పిలిచి మంత్రి హరీశ్‌రావు మందలించారు. వాకీటాకీలో మాట్లాడుతూ, పోలీసు అధికారులను అప్రమత్తం చేస్తూ వర్షంలోనూ ముందుకెళ్లారు. కోటిలింగాల రహదారి వద్ద గంటల తరబడి శ్రమించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ట్రాఫిక్‌ను చక్కదిద్దేందుకు ఇరవై ఐదు కిలోవిూటర్ల మేర బుల్లెట్‌పై ప్రయాణించారు. భద్రాచలంలో ముందు నుంచి పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తున్నప్పటికీ శనివారం భారీగా వాహనాలు పోటెత్తాయి. దీంతో అంబేద్కర్ సెంటర్‌లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో మంత్రులు జగదీశ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఎస్ వేణుగోపాలచారి రహదారిపై గంటలపాటు నిల్చొని పర్యవేక్షించారు. వాహనదారులను ముందుకు కదిలిస్తూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.