ట్రిపుల్‌ తలాక్‌ ఆర్డినెన్స్‌పై సవాల్‌

పిటిషన్లను తిరస్కరించిన సుప్రీం

న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): ట్రిపుల్‌ తలాక్‌ ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపేందుకు నిరాకరించింది. భార్యకు భర్త వెంట వెంటనే మూడుసార్లు తలాక్‌ అని చెప్పి విడాకులు ఇవ్వడం నేరమని చెప్తున్న ఆర్డినెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరులో జారీ చేసిన సంగతి తెలిసిందే. వెంట వెంటనే తలాక్‌ అని మూడుసార్లు చెప్పి భార్యకు విడాకులివ్వడం నేరమని, అంతేకాకుండా ఈ విధంగా విడాకులివ్వడం చెల్లదని ఈ ఆర్డినెన్స్‌ పేర్కొంది. ఈ నేరానికి పాల్పడిన భర్తకు గరిష్ఠంగా మూడేళ్ళ జైలు శిక్ష విధించేందుకు అవకాశం కల్పించింది. ఆర్డినెన్స్‌ను దుర్వినియోగపరిచే అవకాశం ఉందన్న భయాలను దూరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలను చేసింది. నిందితునికి విచారణకు ముందు బెయిలు మంజూరు చేయడానికి అవకాశం కల్పించింది. సుప్రీంకోర్టు గత ఏడాది ఇచ్చిన 3-2 మెజారిటీ తీర్పులో తక్షణ ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. చట్టప్రకారం చెల్లబోదని పేర్కొంది.