ట్విట్టర్‌లో ప్రత్యక్షమవుతున్న మాల్యా

న్యూఢిల్లీ,మార్చి30(జ‌నంసాక్షి): బ్యాంక్‌ రుణాలు చెల్లించకుండా విదేశాలకు వెళ్లిపోయిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా మరోసారి ట్విట్టర్‌ ద్వారా పలకరించారు. తాను భారత్‌ వదిలి వెళ్లినప్పటి నుంచి రుణాల చెల్లింపు కేసులో తన కుమారుడు సిద్దార్థ్‌ మాల్యాను లక్ష్యంగా చేసుకుని పలువురు ట్విట్టర్‌లో దూషిస్తున్నారని మాల్యా మండిపడ్డారు. ‘ఇందులో నా కుమారుడి తప్పేంలేదు. రుణాలు చెల్లించాల్సింది నేను. సిద్ధార్థ్‌ కాదు. తిట్టాలనుకుంటే నన్ను తిట్టండి. నా కుమారుడి జోలికి మాత్రం రావద్దు’ అంటూ వరస ట్వీట్లలో మాల్యా ఆగ్రహం వ్యక్తంచేశారు. మనీ లాండరింగ్‌ కేసులు ఎదుర్కొంటున్న మాల్యా మార్చి 2న భారత్‌ వదిలి లండన్‌ వెళ్లిపోయారు. దీంతో మార్చి 18న మాల్యా కోర్ట్‌లో హాజరుకావాలని ఈడీ మాల్యాకు సమన్లు జారీచేసింది. మార్చి నెలలో భారత్‌ రాలేనని ఏప్రిల్‌లో హాజరవుతానని మాల్యా న్యాయస్థానానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇడి కూడా రెండో సారి సమన్లు జారీ చేసింది.