డబుల్‌ బెడ్‌రూంలు భేష్‌

1
– గవర్నర్‌ కితాబు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌22(జనంసాక్షి):

పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టిస్తోన్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం బాగుందని గవర్నర్‌ నరసింహన్‌ కొనియాడారు. సికింద్రాబాద్‌ బోయగూడలోని ఐడీహెచ్‌ కాలనీలో పేదల కోసం నిర్మిస్తున్న ఇళ్లను గవర్నర్‌ మంత్రులతో కలిసి మంగళవారం  సాయంత్రం పరిశీలించారు.ఐడీహెచ్‌ కాలనీ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనకు వివరించారని అందుకే తాను చూసేందుకు వచ్చినట్లు చెప్పారు. పేదల కోసం ప్రభుత్వం గొప్ప పని చేస్తోందన్నారు. కాలనీలో జీహెచ్‌ఎంసీ అధికారులు పెత్తనం చేయరాదని… కేవలం పర్యవేక్షణ మాత్రమే చేయాలని గవర్నర్‌ సూచించారు. ఎనిమిది నెలల తర్వాత మరోసారి ఐడీహెచ్‌ కాలనీని సందర్శిస్తానని గవర్నర్‌ తెలిపారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ విూడియాతో మాట్లాడుతూ.. ఐడీహెచ్‌ కాలనీ గురించి సీఎం కేసీఆర్‌ వివరించారని తెలిపారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు బాగున్నాయని ప్రశంసించారు. ఈ పర్యటనలో గవర్నర్‌ వెంట తెలంగాణ మంత్రులు నాయిని నర్శింహారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పద్మారావు ఉన్నారు. అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూమ్స్‌ కట్టిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల సందర్భంగా హావిూ ఇచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఐడీహెచ్‌ కాలనీలో గతేడాది దసరా రోజున డబుల్‌ బెడ్‌రూమ్స్‌కు సీఎం భూమి పూజ చేశారు. ఈ ఏడాది దసరా నాటికి ఇండ్ల నిర్మాణాలు పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. ఐడీహెచ్‌ కాలనీలో డబుల్‌ బెడ్‌రూమ్స్‌ ఇండ్లను దసరా పండుగ రోజున అర్హులైన పేదలకు అందజేస్తామని ప్రకటించారు. గత దసరా పండుగకు పనులు ప్రారంభించి ఏడాది కాలంలో ఇండ్ల నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. దసరా రోజున పేదలకు సీఎం కేసీఆర్‌ ఇండ్ల పట్టాలను అందజేస్తారు. 396 కుటుంబాలకు ఇండ్లను అందజేయనున్నట్లు వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులందరికీ లాటరీ పద్ధతిలో ఇండ్లను కేటాయిస్తామని పేర్కొన్నారు.