డబ్లీన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

3

– స్వచ్చ్‌ గంగా ప్రాజెక్టుకు సహకరిస్తాం

– ఐర్లాండ్‌ ప్రధాని

డబ్లిన్‌ ్‌,సెప్టెంబర్‌23(జనంసాక్షి):

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ గంగా ప్రాజెక్టుకు సహకరిస్తామని ఐర్లాండ్‌ ప్రధాని ఎండా కెన్నీ చెప్పారు. ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, కెన్నీ కీలక అంశాలపై చర్చలు జరిపారు.    ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, భౌగోళిక అంశాలపై ప్రధాన మంత్రులు చర్చించారు. అనంతరం మోదీ, కెన్నీ సంయుక్తంగా విూడియా సమావేశంలో మాట్లాడారు. భారత్‌, ఐర్లాండ్‌ల మధ్య పలు విషయాల్లో సారూప్యత ఉందని మోదీ అన్నారు. ఐర్లాండ్‌ అభివృద్ధిలో ప్రవాస భారతీయుల

కృషి ఉందని చెప్పారు.అంతకు ముందు వారం రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఐర్లాండ్‌ రాజధాని డబ్లిన్‌ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. 60 ఏళ్ల విరామం తర్వాత భారత ప్రధాని ఒకరు ఐర్లాండ్‌కు రావడం ఇదే తొలిసారి. 1956లో నాటి ప్రధాని నెహ్రూ ఐర్లాండ్‌ను సందర్శించారు. డబ్లిన్‌ చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశ ప్రధాని ఎండా కెన్నీ రెడ్‌ కార్పెట్‌ వెల్‌కం చెప్పారు. ప్రధాని మోదీకి ఐర్లాండ్‌ ప్రధాని ప్రత్యేకంగా తయారు చేసిన  టిషర్ట్‌ బహుకరించారు. టీం జెర్సీకి చెందిన ఆ టి షర్ట్‌పై మోదీ అని రాసి ఉంది. భద్రతా మండలిలో చోటు కోసం భారత్‌కు మద్దతిస్తామని ఐర్లాండ్‌ నాయకత్వం హావిూ ఇచ్చింది. ఐర్లాండ్‌కు చెందిన 70కి పైగా టెక్‌ కంపెనీలు భారత్‌లో ఉన్నాయి. మరిన్ని కంపెనీలను ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన ఐర్లాండ్‌ పెట్టుబడిదారులను కోరనున్నారు.  పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఐర్లాండ్‌లో స్థిరపడిన భారతీయులతో కూడా సమావేశమౌతారు.  ప్రధాని నరేంద్ర మోడీ ఐర్లాండ్‌, అమెరికా పర్యటనకు బుధవారం ఉదయం బయలుదేరి వెళ్లారు.  ఐర్లాండ్‌ పర్యటనలో భాగంగా డబ్లిన్‌లో ప్రభుత్వాధినేత ఎండా కెన్నీతో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.