డస్సిపోతున్న టిఆర్‌ఎస్ అభ్యర్థులు
ప్రత్యర్థి అభ్యర్థి తెలియకుండానే ప్రచారం
ఖర్చుల కోసం అనుచరుల చేయిచాత
ముందే ప్రచారంతో ఖర్చులు తడిసి మోపెడు
మరో నెలన్నర దాకా ఎలా అన్న ఆందోళన
హైదరాబాద్,అక్టోబర్24(జనంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా టిఆర్‌ఎస్ అభ్యర్థులు ఇప్పటికే సగం ప్రచారాన్ని పూర్తి చేశారు. ఊరూవాడా తిరుగుతూ ప్రచార¬రు గుప్పిస్తున్నారు. ఓ వైపు అభ్యర్థులు, మరోవైపు మంత్రులు కూడా అభ్యర్తులకు తోడుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో గత నెలన్నర రోజులుగా ఒక్కఓ అభ్యర్థికి, వారివెన్నంటి ఉండే అనుచరులకు ఖర్చు తడిసి మోపెడు అవుతోంది. మరో నెలన్నర ఇలా ఊరూవాడా తిరగాల్సిందే. ముందే అభ్యర్థులను ప్రకటించడం కారణంగా ప్రచారంలో ఖర్చు పెట్టలేక డస్సి పోతున్నారు. అందుకే కొందరు అభ్యర్థులు కేవలం పైపై ప్రచారంతో ప్రజలను కులసుకుని హాయ్ అని చెబుతున్నారు. అన్నింటికి మించి కెసిఆర్ ప్రచారం తమను గట్టెక్కిస్తుందన్న ధీమాలో ఉన్నారు. డిసెంబర్ 7న పోలింగ్ జరగడానికి ముందు రోజు వరకు ప్రచారం చేయాల్సి ఉంటుంది. దీంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించినప్పడు ఉన్న ఉత్సాహం కాలక్రమేణా తగ్గుతోంది. ప్రత్యర్తులు ఎవరో తెలియకుండా ఊరూవాడా చుట్టిరావడంతో ఎక్కడికి వెళ్లినా కొందరు అదేపనిగా ఖర్చులకోసం అంటూ చేతులు చాపుతున్నారు. మరోవైపు ఎన్నికల్లో ఎవరితో పోరాడాలో తెలియని స్థితిలో టీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. తమ ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచా లేక సిపిఐ నుంచి..లేక టిజెఎస్ లేదా టిడిపి నుంచా అన్నది తెలియడం లేదు. కాంగ్రెస్ కూటమిలో ఎవరికి సీటిస్తుందోనని ఆ పార్టీ ఆశావహుల్లో ఉన్న టెన్షన్ కన్నా రంగంలో ఉన్న టీఆర్‌ఎస్ అభ్యర్థులకే ఎక్కువవుతోంది. బీజేపీ కొన్నిచోట్ల సీట్లకు తమ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ వారు ప్రత్యర్థికి పోటీ ఇచ్చే స్థాయి లేదన్న భావనలో టిఆర్‌ఎస్ నేతలు ఉన్నారు. మిగతా చోట్ల ఆ పార్టీ కూడా ఎవరికి సీటిస్తుందో తెలియని పరిస్థితి. ఈ స్థితిలో ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన టీఆర్‌ఎస్ నేతలు ప్రత్యర్థి ఎవరో తెలియకుండా ప్రజల్లోకి వెళ్లి ఎవరిని విమర్శించాలో తెలియక… నామమాత్రపు ప్రచారంతో ప్రజలను కలుసుకుంటున్నారు. ప్రభుత్వ విజయాలను వివరించి నెలన్నర తరువాత జరిగే పోలింగ్ నాడు తమకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులకు టికెట్లు వచ్చిన తరువాత పదిరోజులపాటు ఓ వైపు ఉత్సవాలు నిర్వహించుకుంటూనే అసమ్మతి, వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నం చేశారు. వినాయక చవితి మొదలు దసరా వరకు నియోజకవర్గాల్లో మండలాల వారీగా అడపాదడపా ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు దసరా తరువాత ఆలోచనలో పడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరో తేలకుండా గ్రామాల్లోకి వెళ్లి ప్రచారం చేసుకుంటూ పోయేకన్నా పోటీలో ఉండేదెవరో తేలాకే పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాలని భావిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తే ఊపు వస్తుందని అంచనా వేస్తూ, ఆయన రాకకోసం ఎదురుచూస్తున్నారు. కేటీఆర్‌తోనైనా బహిరంగసభలు ఏర్పాటు చేయిస్తే ఫలితం ఉంటుందన్న ఆలోచనతో ఉన్నారు. దీంతో కొన్ని నియోజక వర్గాలలో నామ్‌కే వాస్తేగా ప్రచారం జరిపి అయిందనిపిస్తున్నారు. మరికొందరు అభ్యర్థులు హైదరాబాద్, జిల్లా హెడ్‌క్వార్టర్లకే పరిమితం అవుతున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించమని కేసీఆర్ చెప్పినా, మహాకూటమి, బీజేపీ అభ్యర్థుల అధికార ప్రకటన తరువాతే ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. సెప్టెంబర్ 6వ తేదీన అసెంబ్లీని రద్దు చేసిన ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అదేరోజు 105 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.