డార్విన్‌ పరిణామ సిద్దాంతంపై రాద్దాంతం

చర్చకు దారితీస్తున్న సత్యపాల్‌ సింగ్‌ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ,జనవరి22(జ‌నంసాక్షి): ఛార్లెస్‌ డార్విన్‌ ఆవిష్కరించిన జీవ పరిణామ సిద్ధాంతంపై కేంద్ర మానవ వనరుల శాఖ ఉప మంత్రి సత్యపాల్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అంతేనా అంటే ఇప్పుడందరూ డార్విన్‌ భక్తులుగా మారిపోయారు. అయితే డార్విన్‌ సిద్దాంతం కేవలం ఊహాజనిత మాత్రమే. ఆయన పరిణామక్రమాన్ని వివరించే ప్రయత్నంలో ఇలా జరిగి ఉంటుందని మాత్రమే వివరించారు. కోతి నుంచి మానవుడు పుట్టాడని, జీవులు తమ దైనందిన అసవరాల కోసం మార్పునకు గురయ్యాని సూత్రీకరించారు. జీవుల పరిణామ క్రమంపై డార్విన్‌ ఆవిష్కరించిన ఈ సిద్ధాంతం ‘శాస్త్రీయంగా తప్పు’ అని మంత్రి సత్యపాల్‌సింగ్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యల్లో కూడా నిజం ఉంది. డార్విన్‌ సిద్దాంతానికి ప్రాతిపదిక గానీ రుజువులు కానీ లేవు. వేల ఏండ్లలో అలాంటిది జరిగిన దాఖలాలు లేవు. ఇదిలా వుండగా డార్విన్‌ సిద్ధాంతంపై తాను చేసిన వ్యాఖ్యలను మంత్రి సత్యపాల్‌సింగ్‌ గట్టిగా సమర్థించుకున్నారు. డార్విన్‌ మానవ పరిణామ సిద్ధాంతాన్ని ఇప్పుడుప్రపంచ వ్యాప్తంగా సవాలు చేస్తున్నారన్నారు. డార్విన్‌ సిద్ధాంతం ఒక అభూత కల్పన అని, తాను ఎటువంటి ఆధారాలూ లేకుండా వ్యాఖ్యలు చేయనని ఆయన స్పష్టం చేశారు. తాను ఆర్ట్స్‌ నేపథ్యం నుండి రాలేదని, తాను ఢిల్లీ యూనివర్శిటీలో కెమిస్ట్రీ పిహెచ్‌డి చేశానని వివరించారు. మంత్రి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడవిూ (ఇన్సా) మాజీ అధ్యక్షుడు రాఘవేంద్ర గడ్కర్‌తో సహా పలువురు శాస్త్రవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు శాస్త్ర సమాజాన్ని అవమానించటమేనని అన్నారు. శాస్త్రవిజ్ఞానాన్ని, శాస్త్రవేత్తలను రాజకీయంగా విడదీసే లక్ష్యంతోనే మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారని, అత్యంత ప్రమాదకరమైన ఈ ధోరణిని శాస్త్రసమాజం కలిసికట్టుగా ప్రతిఘటించాలని ఆయన సూచించారు. ప్రాథమిక స్థాయిలో లభిస్తున్న ఆధారాలన్నీ లక్షల సంవత్సరాల క్రితం నివశించిన చింపాంజీల నుండి ప్రస్తుత మానవాళి ఆవిర్భవించినట్లు తెలుస్తోందన్నారు. అందువల్ల మానవాళి ఆవిర్భావానికి సంబంధించిన అంశాలను శాసనాలు, పురాణాలలో పొందుపర్చే అవకాశ మే లేదని ఆయన స్పష్టం చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు శాస్త్ర విజ్ఞానానికి, శాస్త్ర సమాజానికి తీరని అవమానమని ప్రముఖ జీవశాస్త్రవేత్త కిరణ్‌ మజుందార్‌షా తీవ్రంగా విమర్శించారు. బాధ్యతాయుతమైన మంత్రిపదవిలో వుంటూ ఇటువంటి వ్యాఖ్యలుచేయటం ఆ పదవికే సిగ్గుచేటైన విషయమని ఆయన దుయ్యబట్టారు. సత్యపాల్‌ సింగ్‌ వ్యాఖ్యలు ‘నాన్సెన్స్‌’ అంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేష్‌ కొట్టిపారేశారు.