డిమాండ్ల సాధనకు ఇదే సమయం
ఎన్నికల్లో తమ సమస్యలను ఏకరువు పెట్టడం ద్వారా హావిూలు రాబట్టుకోవడం సమజం. పార్టీలు, కులాలు ఇవే చేస్తుంటాయి. పొత్తుల్లో అనేక సమస్యలను ప్రస్తావిస్తారు. ఇప్పుడు బిసిలకు సీట్లు ఇవ్వడం, దూరం పెట్టిన కులలను మళ్లీ బిసిల్లో చేర్చడం అన్న అంశాలపై బిసి సంక్షేమ సంఘం సారధి ఆర్. కృష్ణయ్య పోరాడుతున్నారు. తమ సమస్యలను ఆయన మహాకూటమి ముందుంచారు. తెరాస ప్రభుత్వం తొలగించిన 26 కులాలను తమ పార్టీ అధికారంలోకి రాగానే తిరిగి బీసీ జాబితాలోకి చేర్చుతామని హావిూ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు 50 శాతం టికెట్లు కేటాయించాలంటూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నాయకత్వంలోని బీసీ నాయకులు కాంగ్రెస్ నేత జానారెడ్డిని కలిశారు. 22 రాష్ట్రస్థాయి డిమాండ్లు, 7 కేంద్ర స్థాయి డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను జానారెడ్డికి అందచేశారు. ఎన్నికల ముందే ఇలాంటి డిమాండ్లు ముందుంచి మద్దతు తెలపడం వల్ల మాత్రమే సమస్యలను భవిష్యత్ లో సాధించుకునే వీలుంటుంది. ఇప్పుడు మందకృష్ణ కూడా మాదిగ రిజర్వేషన్‌పై కచ్చితమైన హావిూని పొందాల్సి ఉంది. బిజెపి,కాంగ్రెస్‌లలో ఏది తమకు అనుకూలమో ఎంచుకోవాల్సి ఉంది. అంబేడ్కర్ మహాశయుడు అందించిన రిజర్వేషన్లు దళిత వర్గాలకు కులాల వారీగా వర్గాలకు దక్కడం లేదు. ఎస్సీల వర్గీకరణ ద్వారా ఎస్సీ ఉపకులాలకు న్యాయం చేయాలని కోరుకోవడంలో తప్పులేదు. సామాజిక న్యాయం కోసం దళితులు చేస్తున్న పోరాటంలో న్యాయం ఉన్నా ఎందుకనో గత రెండు దశాబ్దాలుగా పాలకులు పట్టించుకోవడం లేదు. అయితే అలుపెరగకుండా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ చేస్తున్న పోరాటం కీలక దశకు చేరుకుంటున్నట్లే అనిపించినా ఎక్కడో ఓ చోట బ్రేక్ పడుతూనే ఉంది. నాయకులు హావిూలు ఇవ్వడం, వెనక్కి తగ్గడం వల్ల ఆయన పోరాటం కలసి రావడం లేదనే చెప్పాలి. ఈ దశలో మరోమారు ఎన్నికలు తరుముకొస్తున్నాయి. మహాకూటమితో అన్ని పార్టీలు ఏకమయ్యాయి. గద్దర్ లాంటి వ్యక్తి కూడా ఖద్దర్‌కు జై అన్నారు. ఇంత జరుగుతన్నా మందకృష్ణ పయనం ఎటు అన్నది తేలడం లేదు. ఆయన కూటమితోనా లేక మరెవరితోనా అన్నది తేలాల్సి ఉంది. ఆయన ఒకవేళ కటమికి మద్దతు ప్రకటిస్తే అది మరింత బలోపేతం కావడం ఖాయం. రిజర్వేషన్లపై ఆయన పోరాటం అనన్య సామాన్యం. ఓ దశలో ఈ డిమాండ్ పరిష్కరించేందుకు కేంద్రం సూత్రప్రాయంగా సుముఖతను వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇందుకు నిరభ్యంతరంగా ఉందని గతంలోనే ప్రకటించింది. ఈ దశలో త్వరలోనే కేంద్రమే ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న భావన వచ్చింది. అయితే ఎందుకనో అది ఎక్కడ మొదలయ్యిందో అక్కడే నిలిచి పోయింది. కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మందకృష్ణ పోరాటాన్ని అభినందించి ఆపన్నహస్తం సాచారు. అయితే కొన్ని రాజకీయ పార్టీల నేతలు దళితుల గురించి పెద్దపెద్ద ఉపన్యాలు ఇస్తున్నా ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాలపై చర్చించడం లేదు. ఎస్సీల్లో మాదిగలకన్నా ఇంకా హీనంగా అనేక జాతులున్నాయి. ఇకపోతే రిజర్వేషన్లు పొంది ఉన్నత స్థానాలు అందుకున్న వారు ఇంకా రిజర్వేషన్లు పొందుతూనే ఉన్నారు. దీనివల్ల కూడా ఎస్సీలకు న్యాయం జరగడం లేదు. రిజర్వేషన్లు పొంది అత్యున్నత స్థాయికి చేరుకున్న వారికి ఎక్కడో ఒకచోట చెక్ పెట్టకపోతే మిగతా దళితులకు న్యాయం జరగదు. దళిత రిజర్వేషన్లను ఒక కుటుంబంలో ఎంతమందికి, ఎన్నిసార్లు అన్న విధానం రావాల్సి ఉంది. ఇందుకోసం ముందుగా సామాజిక కోణంలో అధ్యయనం చేయాలి. ఇదో రకమైన సమస్యగా ఉత్పన్నం కాకుండా ప్రస్తుత వర్గీకరణ సమస్యను కూడా చర్చ చేయాల్సి ఉంది. ఓ సామాజిక న్యాయం కోసం తలెత్తిన ఉద్యమం దండోరా అని చెప్పడంలో ఎవరికి
కూడా అనుమానాలు ఉండరాదు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఒక న్యాయబద్ధమైన సామాజిక అంశంగా గుర్తించాలి. అందుకే దీనికి మద్దతు సర్వత్రా లభించటం కూడా గుర్తించాలి. న్యాయబద్ధం హేతుబద్ధం అయిన కోరిక కనుకే అన్ని వర్గాల మేధావులు, రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయి. ఎస్సీ రిజర్వేషన్ అయిన పదిహేను శాతాన్ని ఉపకులాల వారీగా విభజించాలని మాదిగలు ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. దీంతో ఎస్సీల్లో ఉండే 60 ఉపకులాలు ప్రయోజనం పొందుతాయి. తమ తోటి అణగారిన ఎస్సీ కులాల న్నింటికి ప్రయోజన కారిగా ఉండాలని మాదిగలు కోరుకోవడంలో ఔచిత్యం ఉంది. సుప్రీం కోర్టు తీర్పు, ఉషామెహ్రా నివేదిక, సమస్యను తెలుగు ప్రాంతాలను దాటి పార్లమెంటు ప్రాంగణానికి చేర్చాయి. ఆర్టికల్ 341సవరణ ద్వారా వర్గీకరణ చేయొచ్చని ఉషామెహ్రా నివేదిక సూచించింది.రాష్ట్రప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, మేధావులు మద్దతు తెలుపుతున్నారు కనుక కేంద్రం ఓ అడుగు ముందుకేసి వర్గీకరణ జరగడానికి చొరవ తీసుకోవాల్సి ఉన్నా ఎందుకనో పక్కన పెట్టేసింది. కొన్ని తరాలుగా అణచివేతకు గురయిన ఉపకులాలను సమాజంలో పౌరులుగా గుర్తించాలంటే వారికి హక్కును పొందే అవకాశం ఇవ్వాలి. దానికి రాజ్యంగ సవరణెళి మార్గం అని గుర్తించాలి. ఈ ప్రయత్నంలో మందకృష్ణ చేయని పోరాటం లేదు. అన్ని రాజకీయ పార్టీలను కదిలించినా లాభం లేకుండా పోయింది.ఈ ఎన్నికల్లో దీని సాధనకు ఆయన గట్టిగా నిలబడి హావిూని నెరవేర్చే పార్టీకి మద్దతు పలకడం ద్వారా మరోమారు తమసమస్యపై చర్చించాల్సి ఉంది. ఏ పార్టీ ఖచ్చితమైన హావిూ ఇస్తుందన్నది గుర్తించి అందుకు తగ్గట్లుగా తమ మద్దతును ఇచ్చేలా ఒప్పందం చేసుకుంటే ఎన్నికల తరవాత డిమాండ్‌ను సాధించుకునే అవకాశం ఉంటుంది.