డీఎస్‌పై తిరుగుబావుటా

– డీఎస్‌కు వ్యతిరేకంగా ఏకమైన నిజామాబాద్‌ తెరాస నేతలు
– ఎంపీ కవితతో సమావేశమైన నేతలు, ప్రజాప్రతినిధులు
– భాజపాలో ఉన్న కుమారుడికి సహకరిస్తున్నాడంటూ ఆరోపణ
– ఆయనపై చర్యలు తీసుకోవాలని అధిష్ఠానానికి లేఖ
– విలేకరుల సమావేశంలో డిఎస్‌ఫై ఫైర్‌ అయిన కవిత
– కుటుంబంలో అభిప్రాయ బేధాలుంటే వ్యక్తిగతంగా పరిష్కరించుకోవాలి
– పార్టీని నాశనం చేసేలా వ్యవహరించకూడదు
– డీఎస్‌ వ్యవహారంలో అధిష్టానం కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నాం
– అధిష్టానానికి పంపిన లేఖలో పేర్కొన్న కవిత, తెరాస నేతలు
– నేతల ఫిర్యాదుపై స్పందించని డీఎస్‌
– వారు అధిష్టానంకు ఫిర్యాదు చేశారు.. నా గొంతు కొస్తామనలేదు కదా!
– సీఎంతో భేటీ అవుతున్నాం.. అన్ని విషయాలు చర్చిస్తానన్న డీఎస్‌
నిజామాబాద్‌, జూన్‌27(జ‌నం సాక్షి) : తెరాస రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌పై నిజామాబాద్‌ జిల్లా నేతలు తిరుగుబాటు చేశారు. డీఎస్‌ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఎంపీ కవితకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం కవిత నివాసంలో పలువురు తెరాస నేతలు, ప్రజాప్రతినిధులు హాజరై డీఎస్‌ వ్యవహారశైలిపై చర్చించారు. డి.శ్రీనివాస్‌ కుమారుడు ఇటీవల భాజపాలో చేరడంతో ఆయన కూడా ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో నేతలతో సుదీర్ఘంగా చర్చించిన కవిత అధిష్టానంకు ఫిర్యాదు చేద్దామని పేర్కొన్నారు. దీంతో డీఎస్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ అధిష్ఠానానికి రాసిన లేఖను పార్టీ జిల్లా బాధ్యురాలు తుల ఉమకు.. ఎంపీ కవిత సహా నేతలు అందజేశారు.
పార్టీని నాశనం చేయాలని చూస్తే ఎలా ఊరుకుంటారు..? – ఎంపీ కవిత
జిల్లా తెరాస నేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశమైన కవిత అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల్లో నిజామాబాద్‌ జిల్లా ప్రజలు తెరాసకు పట్టం కట్టారని, మొత్తం 9 నియోజకవర్గాల్లోనూ గెలిపించి తెరాస అధికారంలోకి రావడానికి సహకరించారన్నారు. అందుకే ఈ జిల్లా అంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెప్పలేనంత అభిమానమన్నారు. ఆ కారణంతో జిల్లాలో సీనియర్‌ రాజకీయ నేతగా ఉన్న డీఎస్‌ పార్టీలోకి వస్తానంటే కేసీఆర్‌ సాదరంగా ఆహ్వానించారని తెలిపారు. అంతరాష్ట్ర సలహాదారుగా నియమించి కేబినెట్‌ ¬దా కల్పించారని, తదనంతరం రాజ్యసభ సభ్యుడిగానూ అవకాశం కల్పించారని కవిత పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు జిల్లా నేతలంతా ఆయనకు సముచిత గౌరవం ఇస్తూ వచ్చారు. అయితే ఇటీవల డీఎస్‌ కుమారుడు భాజపాలో చేరారని, అప్పట్నుంచీ ఆయనలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోందన్నారు. తన కుమారుడు ఉన్న పార్టీకి అనుకూలంగా పనిచేయాలంటూ ఆరేడు నెలలుగా డీఎస్‌ తెరాస కార్యకర్తలను ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని పలువురు కార్యకర్తలు మా దృష్టికి తీసుకొచ్చారని, ఓ వ్యక్తి వల్ల కింది కేడర్‌ ఇబ్బందులు పడుతున్నందునే మేం బయటకు రావాల్సి వచ్చిందని కవిత తెలిపారు. కుటుంబంలో అభిప్రాయ బేధాలుంటే ఆయన వ్యక్తిగతంగా పరిష్కరించుకోవాలని, అంతేగానీ పార్టీని నాశనం చేసేలా వ్యవహరించకూడదని పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా డీఎస్‌ వ్యవహరిస్తున్న తీరును అధిష్ఠానానికి తెలియజేయాల్సిందిగా నిజామాబాద్‌ జిల్లా తెరాస అధ్యక్షురాలు తుల ఉమకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మా ఆవేదనను తెలియజేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశామని తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా నా బిడ్డలు వ్యవహరించినా కఠినచర్యలు తప్పవని కేసీఆర్‌ తరుచూ హెచ్చరిస్తుంటారని, డీఎస్‌ వ్యవహారంలోనూ అలాగే ఉండాలని కోరుతున్నామన్నారు. పార్టీలో ఇలాంటి సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరిస్తేనే వచ్చే ఎన్నికల్లోనూ నిజామాబాద్‌ జిల్లా మొత్తం తెరాస జెండా రెపరెపలాడించవచ్చునన్నారు. తెరాస క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, పార్టీలో ఎంతటి నాయకులైనా సరే క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సహించవద్దని అధినేతను కోరుతున్నామని అన్నారు.
కేసీఆర్‌తో భేటీ తరువాత మాట్లాడతా..
నిజామాబాద్‌ జిల్లా తెరాస నేతలు తనకు వ్యతిరేకంగా అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడంపై స్పందించేందుకు తెలంగాణ ప్రభుత్వ అంతరాష్ట్ర వ్యవహారాల సలహాదారు, తెరాస రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ నిరాకరించారు. జిల్లా నేతలు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తనకు తెలియదన్నారు. ఆ విషయం వారినే అడగాలని విలేకరులతో అన్నారు. ‘వారు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. నా గొంతు కోస్తామని అనలేదు కదా’ అని డీఎస్‌ వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ అభివృద్ధికి కృషి చేశానే తప్ప వ్యతిరేకంగా ఎప్పుడూ వ్యవహరించలేదని డీఎస్‌ స్పష్టం చేశారు.నిజామాబాద్‌ జిల్లా తెరాస నేతలు తనపై చేసిన ఆరోపణల నేపథ్యంలో డి.శ్రీనివాస్‌ తన కుమారుడు సంజయ్‌, ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. తనపై ఆరోపణలు చేసేందుకు దారితీసిన పరిస్థితులపై చర్చించారు. కాగా తాజా పరిణామాల నేపథ్యంలో డి.శ్రీనివాస్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుంచి పిలుపొచ్చింది. డీఎస్‌ మంగళవారం కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కోరగా.. బుధవారం ముఖ్యమంత్రిని కలవాలంటూ సీఎం కార్యాలయం నుంచి ఆయనకు సమాచారం వచ్చింది. నిజామాబాద్‌ జిల్లా నేతలు తనపై చేసిన ఆరోపణలపై డీఎస్‌ ముఖ్యమంత్రికి వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో నిజామాబాద్‌ జిల్లా రాజకీయం రసకందాయంగా మారింది.