డెడ్‌లైన్‌.. 30రోజులే..

` గడవు దాటితే కచ్చితంగా ఫెడరల్‌ గవర్నమెంట్‌ వద్ద తప్పనిసరిగా రిజిస్టర్‌ చేయించుకోవాలి
` లేకుంటే వెంటనే అమెరికాను వీడండి
` ఉల్లంఘిస్తే జైలు,జరిమాన తప్పదు
` విదేశీయులకి అమెరికా హెచ్చరిక
వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికాలో ఎక్కువకాలం నివసిస్తున్న విదేశీ జాతీయులు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్‌ చేసుకోవాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ హెచ్చరికలు జారీ చేసింది. ‘’అమెరికాలో 30 రోజులకు మించి నివసిస్తున్న వారు కచ్చితంగా ఫెడరల్‌ గవర్నమెంట్‌ వద్ద రిజిస్టర్‌ చేయించుకోవాలి. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే.. నేరం కింద పరిగణించి అపరాధ రుసుం, జైలు శిక్షలు విధిస్తారు.అందుకే ఇప్పుడే సొంతంగా వెళ్లిపోండి’’ అని ఎక్స్‌లో సందేశం ఉంచింది.సొంతంగా అమెరికాను వీడటమే ఉత్తమమైన మార్గం. మీ సామాను సర్దుకొని విమానం ఎక్కండి. మీకు ఎటువంటి నేర నేపథ్యం లేకపోతే అమెరికాలో సంపాదించుకొన్న సొమ్మును దాచుకొని బయల్దేరండి’’ అని హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ వెల్లడిరచింది. ఇలాంటి వారు విమాన టికెట్‌ సొమ్మును భరించలేకపోతే.. రాయితీ ఇచ్చేందుకు అమెరికా ఏర్పాట్లు చేసింది.ఈ నిబంధనలు పాటించకపోతే తక్షణమే దేశం నుంచి పంపిచేస్తామని పేర్కొంది. అంతేకాదు.. ఫైనల్‌ ఆర్డర్‌ అందుకొన్న వారు ఒక్క రోజు అధికంగా ఉంటే రోజుకు 998 డాలర్లు ఫైన్‌, సొంతంగా వెళ్లిపోకపోతే 1,000 నుంచి 5000 డాలర్ల ఫైన్‌ విధించనున్నారు. జైలు శిక్షను కూడా విధించే అవకాశం ఉందని. వారికి భవిష్యత్తులో చట్టపరమైన మార్గంలో కూడా అమెరికాలోకి ప్రవేశం లభించదని చెప్పింది.ఈ నిర్ణయం నేరుగా హెచ్‌1బీ, విద్యార్థి పర్మిట్లపై ఉండేవారికి వర్తించదు. కానీ, సరైన అనుమతులు లేకుండా అమెరికాలో ఉండిపోయే వారిపై మాత్రం దీనిని కచ్చితంగా అమలు చేయనున్నారు. ఎవరైనా హెచ్‌1బీ వీసాపై వచ్చి ఉద్యోగం కోల్పోతే.. వారు నిర్ణీత సమయం దాటి అమెరికాలో ఉంటే మాత్రం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విద్యార్థి, హెచ్‌1బీ వీసాదారులు అమెరికా చట్టాలు సూచించిన అన్ని నిబంధనలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.